వందల కోట్లకు సంబంధించి ఆన్లైన్ బెట్టింగ్ మాఫియాపై సైబర్ క్రైం పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. 11 వందల కోట్ల నగదు లావాదేవీలను వేర్వేరు మార్గాల్లో తరలించేందుకు రాహుల్ ముంజాల్ అనే నిందితుడు.... యాన్‌హువోతో కలిసి డొల్ల కంపెనీలు సృష్టించాడు. ఇవన్నీ దిల్లీ, గుర్గావ్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల్లో 28 సంస్థలతో పాటు మరిన్ని కంపెనీలను నమోదు చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కంపెనీలకు సంబంధించి రాహుల్ ముంజాల్ పేరున్నా... ఫోన్ నంబరు, చిరునామా లేకపోవడం వల్ల వ్యక్తి ఉన్నాడా? యాహువో సృష్టించాడా? అని పోలీసులు పరిశోధిస్తున్నారు.
ఒకే పాన్‌కార్డు, మెయిల్, చిరునామాలు
డోకిపే, లింక్‌యున్ కంపెనీల పేర్లతో గుర్గావ్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ఖాతా తెరిచేప్పుడు యానువో, అంకిత్ మాత్రమే వెళ్లారని... రాహుల్ ముంజాల్ వెళ్లలేదని పోలీసులు తెలుసుకున్నారు. చైనీయులు డైరెక్టర్లుగా ఉన్న సంస్థల్లో వ్యవస్థాపకుడిగా రాహుల్ ముంజాల్ పేరుంది. రాహుల్ ముంజాల్ పేరున్న కంపెనీల జాబితాను పోలీసులు సేకరించగా ... పదికి పైనే ఉన్నాయని తెలిసింది. ఈ కంపెనీలు, సంస్థల్లో రాహుల్ ముంజాల్ పాన్ కార్డు, ఈ- మెయిల్, చిరునామా ఉంది. ఇన్ని కంపెనీలకు ఒకే పాన్‌కార్డు, మెయిల్, చిరునామాలున్నా.. బ్యాంకు అధికారులు, ఈ - వ్యాలెట్ సంస్థలకు అనుమానం రాలేదు. ఆయా కంపెనీల్లో ఎంత మొత్తంలో నగదు లావాదేవీలు జరిగాయాన్నది తెలుసుకునేందుకు పోలీసులు... బ్యాంకులు, ఈ - వాలెట్ సంస్థలకు లేఖలు రాశారు.