ప్రముఖ గాయని పేరుతో మోసాలకు పాల్పడుతున్న అనంతపురానికి చెందిన చైతన్య మోసాలు ఒక్కొక్కటిగా బయటపడతున్నారు. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన ఓ మహిళ నుంచి విడతలవారీగా రూ.1.70 కోట్లకు పైగా వసూలు చేసినట్లు బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏడాది క్రితం బాధితురాలికి చైతన్య అనే యువకుడు పరిచయమయ్యాడు. ప్రముఖ గాయని చరవాణి నంబర్‌ను చైతన్య... సదరు మహిళకు ఇచ్చాడు. మహిళ వాట్సాప్‌లో గాయనితో చాటింగ్ చేయడంతో... గాయని ఆ నంబర్‌ను బ్లాక్ చేశారు.
తర్వాత గాయనికి సంబంధించిన వేరే నంబర్ అంటూ చైతన్య మరోటి ఇచ్చాడు. తనే గాయని పేరుమీద చాటింగ్ చేస్తూ మహిళను నమ్మించాడు. ఎప్పుడు వీడియో కాల్ చేసినా మాట్లాడే వాడు కాదు. కేరళలోని ఆనంద చెర్లాయం ట్రస్ట్‌లో రూ.50వేలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని చెప్పడంతో మహిళ తీసుకుంది. అమెరికాలో ఉన్న భూములు అమ్మకానికి పెట్టానని.... దానికోసం కావాల్సిన డబ్బులు సర్దుబాటు చేయాలని గాయని పేరుతో చైతన్య... ఆ మహిళను కోరాడు. అలా విడతల వారీగా రూ.1.70 కోట్లు మహిళ చెల్లించింది.