తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

యాప్​లో క్రికెట్ బెట్టింగ్​.. అప్పుల పాలవుతున్న యూత్ - ఐపీఎల్​ బెట్టింగ్​ ముఠా అరెస్టు వార్తలు హైదరాబాద్

క్రికెట్ బెట్టింగ్ వ్యసనంలా మారుతోంది. యువత క్రమంగా బెట్టింగ్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఐపీఎల్ సీజన్​లో బంతి బంతికి పందెం కాస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. బెట్టింగ్ నిర్వాహకులు.. యాప్​ల సాయంతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. అప్పులు కూడా ఇస్తూ.. యువతను అప్పులపాలు చేస్తున్నారు. కొంతమంది అప్పులెక్కువై ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో పోలీసుల నిఘా ఎక్కువ కావడం వల్ల సాంకేతికతను వాడుకుంటూ బెట్టింగ్​ నిర్వహిస్తున్నారు.

యాపుల్లో బెట్టింగ్​.. అప్పులపాలవుతున్న యువత
యాపుల్లో బెట్టింగ్​.. అప్పులపాలవుతున్న యువత

By

Published : Nov 6, 2020, 3:53 PM IST

క్రికెట్ మ్యాచు​లంటే క్రీడాభిమానులకు పండగే. అందులోనూ 20-20 మ్యాచులంటే ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బంతి బంతికి మ్యాచ్​ ఎటు మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి. చివరి బంతి వరకు ఏ జట్టు గెలుస్తుందో ఊహించలేము. క్షణక్షణం ఉత్కంఠగా కొనసాగుతున్న ఐపీఎల్ మ్యాచుల్లో అయితే క్రికెట్ అభిమానులు మజాను ఆస్వాదిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచులను ఆసరా చేసుకొని బెట్టింగ్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని ప్రత్యేక అప్లికేషన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.

యాపుల్లో బెట్టింగ్​.. అప్పులపాలవుతున్న యువత

హైదరాబాద్​లో భారీగా బెట్టింగ్ నిర్వహిస్తూ.. యువతను అప్పుల ఊబిలో నెడ్తున్నారు. మారుమూల ప్రాంతాలకు బెట్టింగ్ సంస్కృతి పాకింది. ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని యువతతో పందెం కాయిస్తున్నారు. నిర్వాహకులు సూచించిన అప్లికేషన్లను చరవాణిలో డౌన్​లోడ్ చేసుకొని అందులోకి వెళ్తే చాలు. మనకు ఇష్టమైన క్రీడాకారుడు, జట్టు, గెలుపు, పరుగు ఇలా విభిన్నంగా పందెం కాయొచ్చు. కొంతమంది ఏజెంట్లు తమ సహాయకులను రంగంలోకి దింపి యువకుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ బెట్టింగ్​లో డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ. నిర్వాహకులే ఎక్కువగా డబ్బులు పొందుతున్నారు. దీంతో డబ్బులు కోల్పోతున్న కొంతమంది యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు.

ఝార్ఖండ్​కు చెందిన సోనూ కుమార్ అనే యువకుడు బతుకుదెరువు నగరానికి వచ్చి పంజాగుట్టలోని ద్వారకాపురి కాలనీలో ఉండేవాడు. ఐపీఎల్ మ్యాచుల్లో బెట్టింగ్ పెట్టి అప్పులపాలయ్యాడు. ఒత్తిడి తట్టుకోలేక ఈ నెల 3న గదిలో ఉరేసుకొని చనిపోయాడు. కరీంనగర్​కు చెందిన నితీశ్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి కూడా నాలుగు నెలల క్రితం బెట్టింగ్​లో రూ. 4 లక్షలు కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ వెంగల్ రావు నగర్​కు చెందిన ఓ యువకుడు గతేడాది బెట్టింగ్​లో నష్టపోయి బలవన్మరణం చెందాడు.

ఇది వరకు రాజస్థాన్, దిల్లీ, చెన్నై, బెంగళూర్​కు చెందిన బెట్టింగ్ నిర్వాహకులు హైదరాబాద్​లోని లాడ్జ్​లలో తిష్టవేసి బెట్టింగ్ నిర్వహించేవారు. గత రెండు మూడేళ్లుగా పోలీసుల నిఘా పెరగడం వల్ల నిర్వాహకులు వెనక్కి తగ్గారు. కొంతమంది నిర్వాహకులను అరెస్ట్ చేసి పీడీ చట్టం కూడా పోలీసులు ప్రయోగించారు. దీంతో సాంకేతికతను ఉపయోగించుకొని బెట్టింగులు నిర్వహిస్తున్నారు. భాగ్యనగరంలో ఏజెంట్లను నియమించుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్​కు చెందిన నిర్వాహకులు కూడా బెట్టింగ్​ల విషయంలో పోలీసులకు పట్టుబడకుండా తెలివిగా వ్యవహరిస్తున్నారు.

పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా బెట్టింగ్ నిర్వాహకులను గుర్తిస్తుండటం వల్ల పందెంరాయుళ్లు ఒకడుగు ముందుకు వేసి.. ఇతర రాష్ట్రాల ఐపీ అడ్రస్​లతో బెట్టింగ్ అప్లికేషన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. సదరు ఐపీ అడ్రసును గుర్తించి పోలీసులు అక్కడికి వెళ్లినా అక్కడ ఎవరూ ఉండరు. బెట్టింగ్ నిర్వాహకులు యాప్​ల ద్వారా అప్పులు కూడా ఇస్తున్నారు. ఆధార్ నెంబర్, బ్యాంకు ఖాతా, చరవాణి నెంబర్ నమోదు చేస్తే వేయి నుంచి 10 వేల రూపాయల వరకు అప్పులిస్తున్నారు. డబ్బులను మాత్రం చక్రవడ్డీతో కలిపి వసూలు చేస్తున్నారు. కరోనా వల్ల ఆన్ లైన్ బోధన జరుగుతుండటం వల్ల విద్యార్థులు, యువకులు అంతర్జాలంలో బెట్టింగ్​కు ఆకర్షితులవుతున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా.. చదువు పేరుతో బెట్టింగ్ వెబ్ సైట్లు, అప్లికేషన్లలోకి వెళుతూ పందెం కాస్తున్నారు. చివరికి డబ్బులు కోల్పోయి.. ఒత్తిడికి లోనవుతున్నారు.

హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బెట్టింగ్​పై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. బెట్టింగ్ నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ సీజన్​లో 60కి పైగా కేసులు నమోదు చేశారు.

ఇదీ చదవండి:క్రికెట్ బెట్టింగ్ ముఠాలో ఇద్దరు గ్రామ వాలంటీర్లు..ఓ రైల్వే ఉద్యోగి..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details