భార్యను ఓ భర్త దారుణంగా హత్య చేసిన సంఘటన మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మియాపూర్లోబంగారం పని చేసే సతీశ్... భార్య జయలక్ష్మిపై అనుమానంతో సోమవారం రాత్రి బంధువుల ఇంటి వద్ద ఉన్న భార్యపై బండరాయితో దాడిచేసి హతమార్చాడు.
అనుమానంతో భార్యను హతమార్చిన భర్త - అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త
అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది.
బతుకుదెరువు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి కుటుంబంతో సతీశ్ వలస వచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు. సతీశ్ మియాపూర్లో గోల్డ్ స్మిత్ పనులు నిర్వహిస్తుండగా, భార్య జయలక్ష్మి నిజాంపేట్ హిల్ కౌంటీ కాలనీలో సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తుంది. గత కొంత కాలంగా భార్యపై అనుమానంతో సతీశ్... భార్యతో తరచూ గొడవ పడేవాడు.
సోమవారం రాత్రి 10:30 గంటల సమయంలో భార్య జయలక్ష్మి రాజీవ్ గాంధీ నగర్లోని బంధువుల ఇంటి వద్ద ఉండగా మద్యం సేవించి సతీశ్ అక్కడికి వెళ్లాడు. మద్యం మత్తులో ఊగిపోతూ నిద్రిస్తున్న జయలక్ష్మిపై బండరాయితో దాడిచేయగా తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సతీశ్ పరారీలో ఉన్నట్లు సమాచారం.