అక్రమంగా డబ్బు సంపాదించేదుకు ఫేస్బుక్ ద్వారా మహిళకు గాలం వేసి లక్షలు కాజేసిన కేటుగాడిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైకి చెందిన సల్మాన్ నవాబ్ కొంత కాలంగా ముంబయిలో ఉండేవాడు. అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఫేస్‌బుక్‌ని ఎంచుకున్నాడు. మహిళలను పరిచయం చేసుకుని తాను శ్రీమంతుడినంటూ మాయమాటలతో నమ్మించేవాడు. అతని బుట్టలో పడిన ఓ బాధితురాలు అతను చెప్పినట్టల్లా చేసి మోసపోయింది.
ఇలా మోసపోయింది...
గతేడాది జనవరిలో గచ్చిబౌలీలోని ఓ మహిళతో పరిచయం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి వాట్సాప్‌లో వీడియోకాలింగ్, రహస్య చిత్రాలు, వీడియోలు పంపించుకునే వరకు వెళ్లింది. కొన్నాళ్ల తర్వాత తనకు అత్యవసరంగా వ్యాపార నిమిత్తం డబ్బులు కావాలని అడిగాడు. పరిచయస్తుడే కదా అని బాధిత మహిళ సర్దుబాటు చేసింది. దీన్ని అలుసుగా తీసుకుని తరచూ డబ్బులు అడుగేవాడు. దీనికి బాధితురాలు నిరాకరించింది. అప్పుడు తన అసులు రంగు బయట పెట్టాడు సల్మాన్. తన వద్ద ఉన్న బాధిత మహిళ వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. విడతల వారీగా రూ.13లక్షల వసూలు చేశాడు.