తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

యూట్యూబ్​లో చూసి తుపాకుల కొనుగోలు.. చివరికి!

ప్రశాంత విశాఖ జిల్లాలో తుపాకుల అమ్మకాలు కలకలం రేపుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోని విశాఖకు తుపాకులు తీసుకొచ్చి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. పలు రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్​స్టర్లపై కేసులు నమోదు చేశారు. అయితే ఇంకా ఎవరికైనా.. అమ్మకాలు చేశారా? అనేది తెలియాల్సి ఉంది.

guns-sale-in-visakhapatnam-district-in-ap
యూట్యూబ్​లో చూసి తుపాకుల కొనుగోలు

By

Published : Dec 22, 2020, 7:23 PM IST

ఏపీలోని విశాఖ జిల్లాలో పలువురు తుపాకులు కొన్నట్లు పోలీసులు గుర్తించారు. దిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల గ్యాంగ్​స్టర్ల నుంచి తుపాకులను అనకాపల్లి, గాజువాక వాసులు కొనుగోలు చేసినట్లు అనకాపల్లి పట్టణ పోలీసులకు తెలిసింది. ఈ మేరకు పోలీసులు ఆరా తీస్తున్నారు.

యూట్యూబ్​లో చూసి తుపాకుల కొనుగోలు

బయటకొచ్చిందిలా..

అనకాపల్లిలోని ఎన్టీఆర్ కాలనీలో గత నెల 27వ తేదీన భీసెట్టి లోకనాథం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. డిసెంబర్ 3వ తేదీన ఇంటిని శుభ్రం చేస్తుండగా మృతుని బంధువులకు రెండు తుపాకులు, మూడు మ్యాగజైన్లు, 18 రౌండ్ల బుల్లెట్లు దొరికాయి. దీనిపై కేసు నమోదు చేసిన అనకాపల్లి పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లోకనాథానికి తుపాకులు సరఫరా చేసినది దిల్లీకి చెందిన గ్యాంగ్​స్టర్ అభిషేక్ భరద్వాజ్(23)గా గుర్తించారు. ఇతను బీహార్ నుంచి తుపాకులు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

బెదిరింపుల కోసం తుపాకులు

ఉత్తరాఖండ్ దినేష్​పూర్ గ్రామానికి చెందిన సామ్రాట్ దాలి(23), హర్యానాకి చెందిన మోహిత్ అలియాస్ బండిజాట్​ అనకాపల్లి, గాజువాక ప్రాంతాలకు తుపాకులు సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. గాజువాకలోని న్యూ పోర్ట్ ఏరియాకి చెందిన చుక్క బాలగంగాధర్ అలియస్ రాజు భాయ్​కి తుపాకి సరఫరా చేసినట్లు తెలుసుకున్నారు. తుపాకితో రాజుభాయ్​.. ఓ వ్యాపారిని ఆరు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. లేకుంటే మంచి గిఫ్ట్​ అందుతుందని హెచ్చరిస్తూ.. ఇంటి ముందు నోటీసు పెట్టాడని పోలీసుల విచారణలో తేలింది.

యూట్యూబ్​లో చూసి..

అనకాపల్లికి చెందిన లోకనాథం, గాజువాకకు చెందిన బాల గంగాధర్​ యూట్యూబ్​లో చూసి.. తుపాకుల కోసం దిల్లీలోని అభిషేక్ భరద్వాజ్​ని సంప్రదించారు. ఈ మేరకు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దిల్లీ హర్యానా, ఉత్తరాఖండ్, గాజువాక ప్రాంతాల్లోని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. దిల్లీలోని గ్యాంగ్​స్టర్ అభిషేక్ భరద్వాజ్​ మూడు నెలల క్రితం జరిగిన కాల్పుల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఇతడు కూడా విశాఖ జిల్లా ఓ వ్యక్తికి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ వ్యక్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

అనకాపల్లిలో విచారణ

ఇతర రాష్ట్రాల్లో అరెస్టు చేసిన నిందితులను దర్యాప్తు కోసం అనకాపల్లికి తీసుకొచ్చారు. గాజువాకలోని బాలగంగాధర్​ని అరెస్ట్ చేసి.. తుపాకి, రెండు మ్యాగజైన్లు, నాలుగు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని అనకాపల్లి పట్టణ సీఐ భాస్కరరావు తెలిపారు. విశాఖ జిల్లాలో ఎవరెవరికీ తుపాకులు సరఫరా చేశారనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:ప్రభుత్వ తీరుతో స్థానిక సంస్థల నిర్వీర్యం: సీఎల్పీ నేత భట్టి

ABOUT THE AUTHOR

...view details