ఏపీలోని విజయవాడ నగరంలో గంజాయి దందా జోరుగా సాగుతుంది. డబ్బుకోసం దళారులు విద్యార్థులకు మత్తు మైకం కమ్మిస్తున్నారు. మంచి మార్కులతో ఇంటర్ విద్యను పూర్తి చేసి ఇంజినీరింగ్‌లో చేరాడో విద్యార్థి. ఎక్కువ సమయం ఒంటరిగా గదిలో ఉండటం..కళాశాల నుంచి మధ్యలోనే వెళ్లిపోతున్నాడని తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది. తండ్రి లేనప్పుడు తల్లి, సోదరిపై దురుసుగా ప్రవర్తించేవాడు. టీనేజ్ ప్రవర్తన అనుకుని కౌన్సిలింగ్‌కు తీసుకెళ్తే విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. సీనియర్ల నుంచి గంజాయి, ఇతర మత్తు పదార్థాల వాడకం అలవాటుచేసుకున్నాడు ఆ విద్యార్థి. పాన్‌షాపు, ఆటోవాలాల నుంచి వీరికి గంజాయి అందేవి. చివరికి మత్తుపదార్థాలు తానే అమ్మేస్థితికి వెళ్లిపోయాడు. అతని గదిలో వెతికితే పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు దొరికాయి.
ఎవరితోనూ చెప్పుకోలేక..
మరొక విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. బంధువులకు దూరంగా ఉంటున్నాడు. తల్లిదండ్రులు విడిపోవడంతో అమ్మనే కష్టపడి పెంచి పెద్ద చేసింది. ఒక్కగానొక్క కొడుకు ప్రవర్తనలో మార్పు చూసి ఆమె కంగారు పడింది. మానసిక సమస్య అనుకుని కౌన్సిలింగ్‌కు తీసుకెళ్లారు. అక్కడ అసలు విషయం తెలిసింది. క్రీడా మైదానంలో కొందరితో పరిచయం ఏర్పడింది. వారికి గంజాయి తాగే అలవాటు ఉండటంతో.. ఈ బాలుడికి అలవాటైంది. ఈ విషయం తెలిసి తల్లి బాధ పడుతుండటంతో అబ్బాయిలో తప్పు చేశాననే భావన ఏర్పడింది. ఎవరితోనూ చెప్పుకోలేక.. అలవాటు మార్చుకోలేక తప్పు చేశాననే భావనతో లోలోపల మదనపడుతూ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఇవి కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే. ఇటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి.
మత్తుకు బాసినలు అవుతున్న మైనర్లు..
విజయవాడ నగరంలో మత్తు రక్కసి కోరలు చాస్తుంది. పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలో పడేస్తుంది. తాజాగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేసిన తనిఖీల్లో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముక్కు పచ్చలారని విద్యార్థులకు సరదా పేరుతో అలవాటు చేసి మత్తులో ముంచేస్తున్నారు. దళారులు నగదు కోసం అడ్డదార్లు తొక్కుతున్నారు. పాన్‌షాపులు, పాఠశాల పరిసరాల్లో ఉండే నిర్మానుష్య ప్రాంతాలు గంజాయి విక్రయానికి అడ్డాలుగా మార్చుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా నగరానికి రవాణా అవుతున్న గంజాయిని కొందరు విద్యార్థులే విక్రయిస్తున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్లోని ఓ పాన్ షాపుపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దృష్టి పెట్టారు. దుకాణంలో గంజాయి సేవించేందుకు వినియోగించే పేపర్, ఖాళీ గొట్టాలను విక్రయిస్తున్నారు. వీటిని దుకాణదారులు ప్రత్యేకంగా గోవా, హైదరాబాద్‌ల నుంచి కొనుగోలు చేస్తున్నారు. తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఒక్కరోజులోనే భారీ సంఖ్యలో గంజాయి సేవిస్తున్న మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిపంపారు. సంబంధిత పాఠశాలలు, కళాశాలలకు నోటీసులిచ్చారు. 8 మంది గంజాయి విక్రేతలపై కేసులు నమోదు చేశారు. మరోవైపు గంజాయి అక్రమరవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ చెబుతున్నారు. మాదక ద్రవ్యాలకు యువతులు సైతం బానిసలుగా మారుతున్నారని గుర్తించారు.