ఏడాది కింద మెడికల్ రిప్రజెంటేటివ్.. ఇప్పుడు ఓ ప్రముఖ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్. ఓ నర్సింగ్ విద్యార్థి. ఓ ఆసుపత్రిలో ప్రతి రోజూ పదుల సంఖ్యలో రోగుల్ని పరీక్షించే వైద్యురాలు. డిగ్రీలో బీజెడ్సీ చేసిన మరొకరు ఓ ఆసుపత్రిలో ప్రసూతి వైద్యురాలు. ఇంకొకరు ఏ చదువూ లేకుండానే ఏకంగా 30 ఏళ్లుగా సీనియర్ వైద్యునిగా కొనసాగుతున్నారు.. ఇలా ఒకరిద్దరు కాదు మందు బిళ్లలిచ్చే క్లినిక్ డాక్టర్ల నుంచి కాన్పులు చేసే ప్రసూతి వైద్యుల దాకా హైదరాబాద్ షహర్‌లో గల్లీకో ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ ఉన్నారు. వీరంతా ఏం చదవకుండానే నిత్యం వందల మందికి వైద్యసేవలందిస్తున్నారు. ఏ శిక్షణ లేకుండానే కత్తి పట్టి ఆపరేషన్లు చేసేస్తున్నారు. పెద్దపెద్ద కుటుంబాలకు ఫ్యామిలీ డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అందిన ఫిర్యాదులతో స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు జి.శ్రీనివాసరావు.. చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 107 మంది డాక్టర్లపై ఫిర్యాదులందడంతో చర్యలు తీసుకోనుంది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోన్న ఆసుపత్రులపైనా చర్యలు తీసుకోనున్నారు.
విదేశాల్లో చదువులు.. ఇక్కడ సేవలు..:
నగరంలో వైద్యునిగా చలామణి అవుతున్నవారంతా తాము విదేశాల్లో చదువుకున్నామని చెప్తున్నారు. రష్యా, ఫిలిప్పీన్స్, జర్మనీ దేశాలతోపాటు భారత్‌లోని ఇతర రాష్ట్రాల డిస్టెన్స్ యూనివర్సిటీల పేర్లతో తప్పుడు పట్టాలు తెచ్చుకున్నట్లు ఇవన్నీ తప్పుడు పత్రాలేనని అధికారులు గుర్తించారు. వీరిలో చాలామందికి కొవిడ్-19 బాగా కలిసొచ్చింది. జియాగూడ డివిజన్‌లో ఏడుగురు నకిలీ వైద్యుల్ని గుర్తించారు. 30 ఏళ్లుగా రాంపల్లి ప్రాంతంలో సేవలందిస్తున్న ఓ సీనియర్ వైద్యుడినీ నకిలీగా గుర్తించడం గమనార్హం.