హైదరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయికి మ్యాట్రిమోని ద్వారా దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న వెంకట బాలకృష్ణ పవన్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రూ.30 లక్షలు కట్నం తీసుకున్న పవన్‌కుమార్.. పెళ్లి తర్వాత ఆమెను దుబాయ్ తీసుకెళ్లాడు.
పచ్చనోట్ల కోసం నిత్యకల్యాణం.. పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ
మ్యాట్రిమోని ద్వారా అమ్మాయితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నానని, వారి కుమార్తెను కళ్లలో పెట్టుకుని చూసుకుంటానని ఆమె తల్లిదండ్రులను నమ్మించాడు. రూ.30 లక్షలు కట్నం తీసుకుని బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత భార్యను దుబాయ్ తీసుకెళ్లాడు. అప్పుడు బయటపడింది ఆ ప్రబుద్ధుని అసలు బాగోతం...
దుబాయ్ వెళ్లిన తర్వాత పవన్ కుమార్ అసలు బాగోతం బయటపడింది. తనకు ఇంతక్రితమే ముగ్గురితో వివాహం జరిగిందని.. మొదటి భార్యకు పిల్లలు కూడా ఉన్నారనే విషయాన్ని పవన్ తనతో చెప్పాడని బాధితురాలు తెలిపింది. ఎందుకు మోసం చేశావని నిలదీసినందుకు.. దుబాయ్‌లో తనపై పలుమార్లు హత్యాయత్నం చేశాడని వెల్లడించింది.
తల్లిదండ్రుల సాయంతో స్వదేశానికి చేరుకున్న బాధితురాలు.. పవన్‌కుమార్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు ఉపసంహరించుకోవాలని.. అత్తమామలు, పవన్ స్నేహితులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. పవన్ స్నేహితులు.. తన ఈ-మెయిల్, ఫోన్ హ్యాక్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇలాంటి అన్యాయం మరే మహిళకు జరగకుండా పవన్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.