రోజూ రద్దీగా కనిపించే ప్రాంతంలో అందరూ చూస్తుండగానే... పట్టపగలు కత్తులతో దాడికి దిగారు. మెడపై అమానుష రీతిలో పదేపదే నరికిన తీరు జుగుప్సాకరంగా మారగా... బాధితుని పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై... నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొల్ ముంతల్ పహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీనగర్ తండాకు చెందిన రాపాని యాదగిరిపై... అదే గ్రామానికి చెందిన సంపంగి రాములుతోపాటు ఆయన తండ్రి కత్తులతో దాడి చేశారు.
యాదగిరి, రాములు ఇద్దరూ... రాళ్లు కొట్టి విక్రయిస్తుంటారు. తరచూ తగాదా పడే వీరు... క్రమంగా బద్ధ శత్రువులయ్యారు. ఊళ్లో జరిగిన చిన్న వివాదంతో ఆరు నెలల క్రితం రాములుపై... యాదగిరి, ఆయన వర్గీయులు దాడికి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ ఘటనలో యాదగిరితోపాటు ఇంకో 11 మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. కొద్దిరోజులు జైలులో ఉండి... బెయిల్ పై తిరిగొచ్చారు.