రాష్ట్రంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలైనట్లు తెలుస్తోంది. తాజాగా వీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రవేశించినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ కూంబింగ్ ముమ్మరం చేశారు. అనుమానితుల ఫొటోలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ జిల్లాలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
డీజీపీ పర్యటన..
కొద్దిరోజుల క్రితం వరకూ పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు మైలారపు ఆదెల్లు అలియాస్ భాస్కర్, కంకణాల రాజిరెడ్డి, కొయ్యాడ సాంబయ్యలు పర్యటించారు. పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో నియామకాలకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందు జాగ్రత్తగా పోలీసులు నిరంతరం కూంబింగ్ నిర్వహించారు. తిర్యాని అడవుల్లో అనేకమార్లు వీరికి, పోలీసులకూ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అప్పుడు కూడా డీజీపీ స్వయంగా ఈ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
బడే చొక్కారావు నేతృత్వంలో..
బుధవారం కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన డీజీపీ.. తాజా పరిస్థితుల నేపథ్యంలో జిల్లా పోలీసు సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టు కార్యకలాపాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణ కమిటీ సభ్యుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆధ్వర్యంలో కురసం మంగు అలియాస్ భద్రు, పాండు మంగులు, కొవ్యాసి గంగ అలియాస్ మహేష్, మంగ్లు, బూర రాజేష్ అలియాస్ శివ, యాతమ్ నరేంద్ర అలియాస్ సంపత్‌లతో కూడిన బృందం రాష్ట్రంలోకి చొరబడ్డట్లు, ఛత్తీస్‌గఢ్‌కు అనుకొని ఉన్న అటవీ ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. వీరి ఆచూకీ చెబితే బహుమతి కూడా ఇస్తామంటూ ప్రచారం మొదలుపెట్టారు.