చిత్తూరు జిల్లా నగరి వద్ద సినీఫక్కీలో చోరీ జరిగింది. మొబైల్ ఫోన్ల రవాణా లారీని దుండగులు అపహరించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూరు నుంచి ముంబయిలోని ఎంఐ సంస్థ గోదాముకు లారీ వెళ్తుండగా తమిళనాడు-ఏపీ సరిహద్దు సమీపంలో ఈ ఘటన జరిగింది.
డ్రైవర్ కాళ్లు, చేతులు కట్టేసి.. మొబైల్ ఫోన్ల లారీ అపహరణ - cell phone lorry
14:43 August 26
సినీఫక్కీలో చోరీ... సెల్ఫోన్ల లారీ అపహరణ
ఏపీ సరిహద్దులోకి రాగానే దుండగులు లారీని అడ్డగించి డ్రైవర్ కాళ్లు, చేతులు కట్టి కిందపడేశారు. అనంతరం లారీని తీసుకెళ్లి నగరి సమీపంలోని హైవేపై వదిలి పరారయ్యారు. లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు నగరి పోలీసులు విచారణ చేపట్టారు. తమిళనాడు సరిహద్దు అవతలి నుంచే కొంతమంది లారీని అనుసరించినట్లు డ్రైవర్ పోలీసులకు తెలిపారు.
లారీలో 16 పెట్టెల్లో రూ.12 కోట్ల విలువైన 15వేల మొబైల్ ఫోన్లను ముంబయికి తరలిస్తున్నారు. వీటిలో 8 పెట్టెల్లోని ఫోన్లను మాత్రమే దుండగులు అపహరించి మిగతా 8 పెట్టెలను వదిలేసి వెళ్లారు. మొబైల్ ఫోన్లను మరో లారీలోకి మార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
అపహరించిన ఫోన్ల విలువ రూ.7కోట్ల వరకు ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటపై శ్రీపెరుంబుదూరులోని ఎంఐ కార్యాలయానికి పోలీసులు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు దుండగులను పట్టుకోవడానికి వారు ఎటువైపు వెళ్లి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.