కరోనా మహమ్మారి కారణంగా ఇస్లాం పవిత్ర క్షేత్రం మక్కాలో.. గత ఏడు నెలలుగా ఉన్న ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తోంది సౌదీ అరేబియా. ఈ క్రమంలో అక్టోబర్ 4 నుంచి మక్కాలోని ఉమ్రాయాత్రకు సందర్శకులను అనుమతించనున్నట్లు వెల్లడించింది. రోజుకు 6 వేల మందికి ఈ అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆ దేశ మీడియా నివేదించింది. తొలి దశలో సౌదీ పౌరులు, స్థానికులను మాత్రమే అనుమతించనున్నారు.
మసీదులోకి ప్రవేశించి ఉమ్రాయాత్రను చేపట్టే ముందే.. ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కావాల్సిన తేదీ, సమయాన్ని రిజర్వ్ చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానున్నాయి. మసీదులో రద్దీని నిరోధించటం, భౌతిక దూరాన్ని పాటించాలనే ఉద్ధేశంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొబైల్ యాప్ ద్వారా కూడా తమ యాత్ర మార్గాలను, సమావేశాలను ఎంపిక చేసుకునే వీలు కల్పించారు.
అక్టోబర్ 18 నుంచి రెండో దశ..
అక్టోబర్ 18 నుంచి రెండో దశ ప్రారంభం కానుంది. ఇందులో గరిష్ఠంగా రోజుకు 15000 మంది యాత్రికులను యాప్ ద్వారా కేటాయించిన సమయాల్లో ప్రార్థనలకు అనుమతించనున్నారు. ఈ మసీదులో క్యూబ్ ఆకారంలో ఉన్న కాబాను ముస్లింలు రోజుకు ఐదుసార్లు ప్రార్ధిస్తారు.