Parental Vaccination Against Covid-19: వేగంగా వ్యాప్తి చెందే గుణమున్న కొత్త వేరియంట్ల ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రమాదం తక్కువే ఉంటున్నప్పటికీ పిల్లలకు వైరస్ సోకే ముప్పు ఇంకా తొలగిపోలేదు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల.. వారి కుటుంబంలో వ్యాక్సిన్ తీసుకోని చిన్నారులకు గణనీయమైన రక్షణ కలుగుతోందని తాజా అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా బూస్టర్ డోసు తీసుకున్న తల్లిదండ్రుల నుంచి ఈ రక్షణ మరింత ఎక్కువగా ఉంటున్నట్లు తెలిపింది.
కొవిడ్‌ను నిరోధించే వ్యాక్సిన్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ చిన్నారుల వ్యాక్సిన్ మాత్రం ఇంకా విస్తృత వినియోగంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకోని చిన్నారులకు వారి తల్లిదండ్రుల నుంచి ఏ మేరకు రక్షణ కలుగుతుందో తెలుసుకునేందుకు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, ఇజ్రాయెల్‌లోని క్లాలిట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు టెల్‌అవివ్ యూనివర్సిటీ నిపుణులు అధ్యయనం చేపట్టారు.
ముఖ్యంగా డెల్టా వేరియంట్ విజృంభణ ఎక్కువగా ఉన్న జూన్-అక్టోబర్ 2021 మధ్యకాలంలో అక్కడ ఈ అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా 76వేల కుటుంబాల నుంచి లక్షా 81 వేల చిన్నారుల ఆరోగ్య సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. వాటిని మూడు, నాలుగో డోసు తీసుకున్న తల్లిదండ్రుల సమాచారంతో పోల్చి చూశారు. వారిలో బూస్టర్ డోసు తీసుకున్న తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలకు ఇన్‌ఫెక్షన్ సోకే ముప్పు 20 శాతం తగ్గగా.. రెండో బూస్టర్ తీసుకున్న వారి నుంచి 58 శాతం ముప్పు తప్పుతున్నట్లు విశ్లేషణలో గుర్తించారు.