తెలంగాణ

telangana

ETV Bharat / international

పెట్రో ధరల పెరుగుదలకు కారణం తెలుసా?

ఒమన్​ సమీపంలోని హొర్ముజ్​ జలసంధి వద్ద చమురు నౌకలపై దాడి జరగడం... ఇరాన్​, అమెరికా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ దాడులపై రెండు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఆందోళనకర పరిస్థితుల మధ్య చమురు ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.

గల్ఫ్ వార్

By

Published : Jun 14, 2019, 4:14 PM IST

Updated : Jun 14, 2019, 5:33 PM IST

పెట్రో ధరల పెరుగుదలకు కారణం తెలుసా?

ఒమన్‌ గల్ఫ్ సమీపంలోని హొర్ముజ్‌ జలసంధి వద్ద రెండు చమురు నౌకలపై దాడి జరిగింది. ఈ దాడులకు సంబంధించి ఇరాన్​, అమెరికా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ దాడికి వాడిన ఆయుధాలు, సమాచారాన్ని బట్టి చూస్తే ఇది పని చేసింది ఇరానేనని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్​ పాంపియో ఆరోపించారు.

"ఈ దాడులకు ఇరాన్​ బాధ్యత వహించాలని అమెరికా ప్రభుత్వం నిర్ధరించింది. దాడిలో వాడిన ఆయుధాలు, నిఘా సమాచారం, నిర్వహణను పరిశీలిస్తే ఇటీవల ఇరాన్​ చేసినట్టే అభిప్రాయపడుతున్నాం. ఈ దాడులు ఇరాన్​ తాజాగా చేసిన ఉద్దేశపూర్వకమైన అమెరికా వ్యతిరేక చర్యలు మాత్రమే. ఈ చర్యలు అంతర్జాతీయ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని స్పష్టమవుతోంది."

-మైక్​ పాంపియో, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి

ఈ ఆరోపణలను ఇరాన్​ అధ్యక్షుడు హసన్​ రౌహానీ తిప్పికొట్టారు.

"రెండేళ్లుగా అంతర్జాతీయ పద్ధతులు, నియమాలను అమెరికా ఉల్లంఘిస్తూ వస్తోంది. అందుకు ఆర్థిక, సైనిక వనరులను ఉపయోగిస్తోంది. ఈ విధమైన కలహశీల విధానం ఈ ప్రాంతానికే కాకుండా ప్రపంచ అస్తిత్వానికి విఘాతం కలిగిస్తుంది."

-హసన్​ రౌహానీ, ఇరాన్​ అధ్యక్షుడు

ఇదీ జరిగింది

అత్యంత రద్దీగా ఉండే హొర్ముజ్​ జలసంధిలో గురువారం ఉదయం గంట వ్యవధిలో రెండు చమురు ఓడలపై దాడి జరిగింది. వాటిలోని నావికులు సురక్షితంగా బయటపడ్డారు. అమెరికా నౌకాదళం అక్కడకు చేరుకుని సాయం అందించింది.

ఈ దాడి ఎలా జరిగిందనే విషయాన్ని ఇంకా ఎవరూ ధ్రువీకరించలేదు. నార్వేకు చెందిన ముడి చమురు నౌక ‘'ఎంటీ ఫ్రంట్‌ ఆల్టెర్‌'’ ముందుగా దాడికి గురైంది. అందులో ఉన్న 23 మంది సిబ్బందిని దుబాయ్‌ నౌక 'హ్యుందయ్‌' రక్షించింది. మరో నౌక.. సింగపూర్‌కు చెందిన ‘'కోకుకా కరేజియస్‌'’ కొద్దిగా పాడైంది. అందులోని 21 మంది నావికులను ఖాళీ చేయించామని, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయని బీఎస్‌ఎం నౌకాసంస్థ తెలిపింది.

ఈ దాడులను ప్రపంచ దేశాలు ఖండించాయి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్స్​ ఈ ఘటనను తప్పుబట్టారు. సంయమనం పాటించాలని ఐరోపా సమాఖ్య పిలుపునిచ్చింది.

చమురు ధరలకు రెక్కలు

అమెరికా-ఇరాన్​ తాజా వివాదంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్​ ముడి చమురు ధర 2.2శాతం ఎగబాకి... బ్యారెల్​కు 61.31 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: సిరియాలో కారు బాంబు పేలుడు.. 17 మంది మృతి

Last Updated : Jun 14, 2019, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details