తెలంగాణ

telangana

ETV Bharat / international

బీరుట్​ పేలుడులో 135కి చేరిన మృతుల సంఖ్య - Beirut explosion: death toll rises to 135 as about 5,000 people are wounded

బీరుట్​లో జరిగిన భారీ పేలుడులో మృతుల సంఖ్య 135కి చేరింది. 5 వేల మందికిపైగా గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనపై లెబనాన్ ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. నౌకాశ్రయ అధికారులను గృహనిర్బంధం చేసింది. అటు.. అంతర్జాతీయ సంస్థలతో పాటు ప్రపంచ దేశాలు లెబనాన్​కు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. అత్యవసర సామాగ్రిని చేరవేస్తున్నాయి.

Beirut explosion: death toll rises to 135 as about 5,000 people are wounded
బీరుట్​ పేలుడులో 135కి చేరిన మృతుల సంఖ్య

By

Published : Aug 6, 2020, 5:34 AM IST

లెబనాన్ రాజధాని బీరుట్​లో జరిగిన విధ్వంసకర పేలుడులో మరణించిన వారి సంఖ్య 135కి చేరింది. 5 వేల మందికి పైగా గాయపడ్డట్లు లెబనాన్ వైద్య శాఖ మంత్రి హమద్ హసన్ వెల్లడించారు.

ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్​ను ఆరు సంవత్సరాల పాటు ఇక్కడ ఎందుకు నిల్వ చేశారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. మరోవైపు ఘటనకు నిర్లక్ష్యమే కారణమంటూ నౌకాశ్రయ అధికారులను ప్రభుత్వం గృహ నిర్బంధం చేసింది. సైన్యానికి పూర్తి అధికారాలు కల్పిస్తూ.. రెండు రోజుల పాటు ఎమర్జెన్సీని ప్రకటించింది.

ఆపన్న హస్తం

భారీ స్థాయి పేలుడుతో అట్టుడికిపోయిన లెబనాన్​కు సాయం అందించేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన ఈ దేశాన్ని ఆదుకునేందుకు సహాయక సిబ్బందిని పంపిస్తున్నాయి.

లెబనాన్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఐరాస వెల్లడించింది. సహాయక చర్యల కోసం అన్ని విధాల సహకరిస్తున్నట్లు తెలిపింది. లెబనాన్​తో పాటు సిరియాలో సహాయ కార్యక్రమాల కోసం ఉన్న ఏకైక నౌకాశ్రయం ఇదేనని.. పేలుడు వల్ల జరిగిన నష్టం కారణంగా ఈ దేశాల్లో ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొంది.

అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెబనాన్​కు భారీగా ఔషధాలను చేరవేస్తోంది. యూఏఈ ప్రభుత్వంతో కలిసి దుబాయి నుంచి సహాయక విమానాలను పంపించింది. మరో 30 టన్నుల వైద్య సామాగ్రిని లెబనాన్​కు పంపించనున్నట్లు యూఏఈ ప్రకటించింది.

బ్రిటన్

5 మిలియన్ పౌండ్ల సహాయ ప్యాకేజీని లెబనాన్​కు అందించనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. సహాయ సిబ్బందితో పాటు వైద్య నిపుణులను ఆ దేశానికి పంపించనున్నట్లు తెలిపింది. బీరుట్ ప్రాంతానికి సమీపంలో ఉన్న రాయల్ నేవీ నౌకలను సహాయ కార్యక్రమాల కోసం తరలించనున్నట్లు స్పష్టం చేసింది.

లెబనాన్ సందర్శన

లెబనాన్​కు రెండు సహాయక విమానాలు పంపించింది ఫ్రాన్స్. అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ త్వరలో బీరుట్​ను సందర్శించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

జర్మనీ

బీరుట్​ పేలుడులో దెబ్బతిన్న తమ రాయబార కార్యాలయ పునరుద్ధరణ కోసం విపత్తు స్పందన దళాలను జర్మనీ చేరవేస్తోంది. సహాయక చర్యల నిమిత్తం పంపనున్న బృందానికి లెబనాన్ అనుమతుల కోసం వేచిచూస్తున్నట్లు వెల్లడించింది.

రష్యా

వైద్యులు, విపత్తు స్పందన దళాలతో పాటు ఔషధాలతో కూడిన సహాయక విమానం బీరుట్​కు చేరుకున్నట్లు రష్యా వెల్లడించింది. ఓ మొబైల్ ఆస్పత్రితో పాటు 50 మంది అత్యవసర సిబ్బంది, వైద్య నిపుణులను పంపినట్లు తెలిపింది. వచ్చే 24 గంటల్లో మరో మూడు విమానాలను పంపించనున్నట్లు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా కరోనా టెస్టింగ్ ల్యాబ్​, వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఇతర సామాగ్రి చేర్చనున్నట్లు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details