తెలంగాణ

telangana

ETV Bharat / international

అబుదాబిపై మరో దాడి.. ఈసారి బాలిస్టిక్ క్షిపణులతో..

Abu Dhabi missiles attack: అబుదాబిపై మరోసారి దాడి జరిగింది. ఇటీవలే అక్కడి విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరగ్గా.. తాజాగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. వీటిని సమర్థంగా అడ్డుకున్నట్లు యూఏఈ వెల్లడించింది. ఇది హౌతీ తిరుగుబాటుదారుల పనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

attack on abu dhabi
uae abu dhabi ballistic missile attack

By

Published : Jan 24, 2022, 9:09 AM IST

Updated : Jan 24, 2022, 9:49 AM IST

Abu Dhabi missiles attack: అబుదాబిపై బాలిస్టిక్ క్షిపణులతో చేసిన దాడిని అడ్డుకున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ ప్రకటించింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడి ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలిపింది.

రాజధాని నగరమైన అబుదాబి లక్ష్యంగా ఈ క్షిపణి దాడి జరిగిందని డబ్ల్యూఏఎం న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. క్షిపణులు అబుదాబి నగరం అవతల పడిపోయాయని స్పష్టం చేసింది. క్షిపణి దాడి వల్ల అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళ్లే రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంట తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని స్థానిక మీడియా తెలిపింది.

వీడియోలు వైరల్..

మరోవైపు, దాడికి సంబంధించినవిగా పేర్కొంటున్న పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఓ వైపు నుంచి క్షిపణులు దూసుకొస్తుండగా.. వాటిని దారిలోనే అడ్డుకునేందుకు మరోవైపు నుంచి మిసైళ్లు ప్రయోగించినట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది.

ఈ సందర్భంగా ప్రకటన విడుదల చేసిన యూఏఈ రక్షణ శాఖ.. తాము ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఇలాంటి దాడులను తిప్పికొట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది.

ఈ దాడికి ఇంతవరకు ఎవరూ బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే, అబుదాబి విమానాశ్రయంలో ఇటీవల డ్రోన్ దాడులకు పాల్పడ్డ హౌతీ తీవ్రవాదులే ఈ క్షిపణులను ప్రయోగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:అబుదాబి ఎయిర్​పోర్ట్​పై డ్రోన్​ దాడి.. భారతీయులు మృతి

Last Updated : Jan 24, 2022, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details