అమౌ హజీ.. వయసు 94. ఈయనకు స్నానం చేయడమంటే మహా చిరాకు. ఎంతలా అంటే 'ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి' అని పిలిపించుకునేంతగా. ఇరాన్‌లో డెగాహ్ గ్రామ శివారులో ఎలాంటి సౌకర్యాలు లేని చిన్నపాటి నివాసంలో ఉండే అమౌ.. ఈ ఏడాది ప్రారంభంలో కొందరు గ్రామస్థుల ప్రోద్బలంతో సుమారు 60 సంవత్సరాల తర్వాత ఒకే ఒక్కసారి స్నానం చేశారు. ఇటీవల స్వల్పంగా జబ్బుపడిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు.
సబ్బు, నీరు అంటే అసహ్యించుకునే హజీ అత్యంత ఆరోగ్యవంతుడు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ముళ్ల పందులను వండుకోకుండానే తినేవారు. మురికి గుంటల్లోని నీటిని తుప్పుపట్టిన డబ్బాల్లో పట్టుకుని తాగేవారు. ఎండిన పశువుల పేడను తనదగ్గరున్న పాత పైపులో పెట్టుకుని పొగ తాగడం, నాలుగు సిగరెట్లు ఒకేసారి కాల్చడం అంటే మహా సరదా. అదే సమయంలో స్నానం అంటే మాత్రం ఆమడ దూరం జరిగేవారు. గతంలో ఓసారి స్నానం చేయించడానికి వాహనంలో తీసుకెళుతుండగా మధ్యలోనే హజీ దూకేశారు. కొన్ని దశాబ్దాలపాటు స్నానం చేయకుండా ఉన్న ఆయన్ను శాస్త్రవేత్తలు పరీక్షించగా ఎలాంటి బ్యాక్టీరియా, పరాన్నజీవుల కారణంగా ఇబ్బంది పడిన దాఖలాలు కనిపించలేదు. పచ్చి మాంసం తినడం వల్ల పేరుకునే ట్రైకినోసిస్ అనే బ్యాక్టీరియా కనిపించింది. దీనివల్ల సాధారణ ఇన్‌ఫెక్షన్ కలుగుతుంది. హెచ్‌ఐవీ, హెపటైటిస్ వంటి పరీక్షలు నిర్వహించగా అన్నింట్లో 'నెగెటివ్' అనే ఫలితమే వచ్చింది.
ఫ్రెంచి, రష్యన్ విప్లవాల గురించి ప్రసంగం
స్నానం చేయకుండా ఉన్నంత మాత్రాన అమౌ హజీ నిరక్షరాస్యుడు అనుకుంటే పొరపాటే. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి కావడం గమనార్హం. అంతేకాదు తన దగ్గరకు వచ్చే వారితో ఆయన ఫ్రెంచి, రష్యన్ విప్లవాల మంచిచెడుల గురించి చర్చించేవారు కూడా. ఇటీవల కాలంలో పదవులు చేపట్టిన రాజకీయ నేతల గురించి కూడా ఆయనకు తెలుసు. స్నానం చేయకపోవడం కారణంగా తనకు వచ్చిన అంతర్జాతీయ గుర్తింపుతో కష్టాలు పడుతున్నట్లు ఆయన వాపోయేవారు. ఇరుగు పొరుగువారు తనను గౌరవించినప్పటికీ, కొందరు అప్పుడప్పుడు ఎగతాళి చేస్తుంటారని, రాళ్లతో కొడుతుంటారని చెప్పేవారు. అమౌ జీవితంపై 2013లో 'ద స్ట్రేంజ్ లైఫ్ అమౌ హజీ' పేరుతో ఓ లఘుచిత్రం సైతం విడుదలైంది.