Prigozhin Wagner Group : ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో భాగంగా ఇన్నాళ్లు రష్యా బలగాలకు అండగా ఉన్న వాగ్నర్ గ్రూప్ అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబావుటా ఎగరేసింది. పుతిన్ సైనిక నాయకత్వాన్ని కూలదోస్తామని వాగ్నర్ కిరాయి సైన్యం చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో తమ బలగాలకు ఎదురవుతున్న సవాళ్ల విషయంలో రష్యా రక్షణ శాఖపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రిగోజిన్.. ఇప్పుడు పుతిన్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. రష్యా పాలనలో ఒలిగార్క్‌లు చాలా శక్తివంతులుగా గుర్తింపు పొందారు. వీరంతా రష్యా ఖనిజాలు, ఇంధనం వంటి వాటిని నియంత్రిస్తూ దేశాన్ని.. శాసిస్తుంటారు. వీరిలో ఓ ప్రత్యేకమైన ఒలిగార్క్ ఉన్నాడు. అతడే ప్రిగోజిన్... ఇతడి చేతిలో కేవలం ఫుడ్ కాంట్రాక్టులు మాత్రమే ఉన్నాయి. ఇది కాకుండా పుతిన్ ప్రైవేట్ సైన్యం ప్రిగోజిన్ కనుసన్నల్లో ఉంది. అదే వాగ్నర్ ప్రైవేటు మిలటరీ కంపెనీ PMC. ఈ గ్రూపులో మొత్తం కిరాయి సైనికులే వుంటారు. వీరు రష్యాకు, పుతిన్‌కు విదేశాల్లో అవసరమైన లక్ష్యాలను సాధించడానికి రహస్యంగా పనిచేస్తారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య క్రమంలో అక్కడి కీలక బఖ్‌ముత్ నగరాన్ని కైవసం చేసుకోవడంలో వీరిదే కీలక పాత్ర.
Wagner Group Chief Prigozhin : రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రిగోజిన్ అంటే తెలియని వారుండరు. అతన్ని పుతిన్ షెఫ్‌గా వ్యవహరిస్తుంటారు. పుతిన్ ఆంతరంగికుల్లో ప్రిగోజిన్ ఒకరు. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్ దాదాపు 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. 1990ల్లో పుతిన్‌కు-ప్రిగోజిన్‌కు పరిచయం ఏర్పడింది. 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడు అయ్యారు. మరోవైపు.. ప్రిగోజిన్ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించాడు. 2001 నుంచి పుతిన్ సన్నిహిత వర్గాల్లో ప్రిగోజిన్ కనిపిస్తూనే ఉన్నాడు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి. ఆ తర్వాత 2014లో వాగ్నర్ పీఎంసీ నిర్వహణలో ప్రిగోజిన్ పాత్ర కూడా బయటకు వచ్చింది. క్రిమియా ఆక్రమణలో లిటిల్ గ్రీన్‌మ్యాన్ రూపంలో వాగ్నర్ గ్రూప్ హస్తం ఉంది. 2016లో ప్రిగోజిన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. 2016 అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌నకు అనుకూలంగా ప్రచారం చేయించింది కూడా ప్రిగోజిన్ అని ఆరోపణలు ఉన్నాయి. 'బ్యాటిల్ ఆఫ్ డెబాల్ట్సెవ్'లో కూడా వీరి హస్తం ఉంది. అమెరికా ఎఫ్‌బీఐ ఇతడిపై 2,50,000 డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది.
వాగ్నర్ పీఎంసీ రష్యా ప్రైవేటు సైన్యం. వాస్తవానికి ఈ పేరుతో ఏ కంపెనీ రిజిస్టరై లేదు. రష్యా సైన్యానికి చెందిన మాజీ లెఫ్టినెంట్ కర్నల్ దిమిత్రి ఉత్కిన్ ప్రారంభించారు. జర్మనీ నియంతకు ఇష్టమైన ఒపేరా కంపోజర్ వాగ్నర్ పేరిట దీనిని ప్రారంభించినట్లు చెబుతారు. ఉత్కిన్- ప్రిగోజిన్‌కు మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రిగోజిన్ వ్యాపార లక్ష్యాలు.. క్రెమ్లిన్ జాతీయ లక్ష్యాల మధ్య సారూప్యత ఉండటంతో వాగ్నర్ గ్రూప్‌కు ఎదురు లేకుండా పోయింది. వాగ్నర్ బృందంలో అత్యధికంగా మాజీ సైనికులే ఉంటారు. వీరికి కొన్ని సందర్భాల్లో సాధారణ రష్యా సైనికుడికంటే చెల్లింపులు ఎక్కువగా ఉంటాయి. వీరు మరణిస్తే కుటుంబానికి దాదాపు 50 వేల డాలర్ల వరకు చెల్లిస్తారు. 2017లో బ్లూమ్‌బెర్గ్ లెక్క ప్రకారం ఈ గ్రూపులో 6,000 మంది ఉన్నారు. ముఖ్యంగా రష్యా మిలటరీ, ఇంటెలిజెన్స్ వర్గాలు వీటిని నియంత్రిస్తుంటాయని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సంస్థ పేర్కొంది.