What to Do If You Lose Passport in Foreign Tour :ప్రపంచంలో ఎవరైనా.. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే పాస్‌పోర్ట్ తప్పనిసరి. ఆయా దేశాలు ఇచ్చే పాస్‌పోర్ట్‌తోనే ఆ వ్యక్తి వివరాలు తెలుస్తాయి. ఈ క్రమంలోనే మీరు విదేశాలకు వెళ్లేటప్పుడు భారత ప్రభుత్వం(Indian Government) అధికారిక గుర్తింపు పత్రంగా ఈ పాస్‌పోర్ట్‌ను అందిస్తోంది. అయితే.. విదేశాలకు వెళ్లినప్పుడు దురదృష్టవశాత్తూ పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. మరి, అలాంటప్పుడు ఏం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మీ పాస్‌పోర్ట్ పోయినట్లయితే.. మొదటగా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు, పాస్‌పోర్ట్ కార్యాలయానికి తెలియపరచాలి. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ధ్రువీకరణ పత్రం తప్పకుండా దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే.. మీరు పాస్‌పోర్ట్ కోల్పోయినట్లు రుజువుగా ఆ కాపీ పనిచేస్తుంది. అలాగే.. కొత్త పాస్‌పోర్ట్ లేదా ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం అప్లై చేయడానికి, రాయబార కార్యాలయంలో విషయం తెలియజేయడానికి పోలీసులు ఇచ్చిన నివేదిక మీకు సహాయపడుతుంది.
సమీపంలోని ఈ కార్యాలయాలను సంప్రదించాలి : ఆ తర్వాత సమీపంలోని భారత రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌ను సంప్రదించాలి. ఎవరైనా విదేశాల్లో ఇరుక్కుపోయిన లేదా పాస్‌పోర్ట్ పోయినా ఇంకా ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్న పౌరులకు సహాయం చేయడానికి విదేశాల్లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలు సహాయం చేస్తాయి. అలాగే.. పాస్ పోర్ట్ తిరిగి పొందడానికి, ఆ ప్రక్రియను పూర్తి చేయటానికి వారు సహాయం చేస్తారు.
కొత్త పాస్‌పోర్ట్ లేదా ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోండిలా..
మీరు పాస్‌పోర్ట్ పోగొట్టుకున్న సందర్భంలో రెండు ఎంపికలు కలిగి ఉంటారు. వాటిలో మొదటిది కొత్త పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసుకోవటం, రెండోది ఎమర్జెన్సీ సర్టిఫికెట్ పొందటం. ఒకవేళ మీరు కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకుంటే.. దానికోసం కనీసం వారం రోజులు వేచి ఉండాలి. అలాగే డూప్లికేట్ పాస్ పోర్ట్ కాకుండా కొత్త నంబర్‌తో పాస్‌పోర్ట్ తాజా చెల్లుబాటు సమయంతో అందించటం జరుగుతుంది. అయితే.. కొత్త పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసే సమయంలో ఈ పత్రాలు అవసరం.
- ప్రస్తుత చిరునామా ధ్రువీకరణ పత్రం
- పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం
- పాస్‌పోర్ట్ ఎలా ఎక్కడ పోయింది (లేదా) పాడైనట్లు తెలిపే అఫిడవిట్
- పాస్‌పోర్ట్ పోయినట్లు పోలీసు రిపోర్ట్