US Sanctions On Hamas : ఇజ్రాయెల్‌పై దాడి నేపథ్యంలో హమాస్‌కు చెందిన 10 మంది సభ్యులతోపాటు గాజా, సుడాన్, తుర్కియే, అల్జీరియా, ఖతార్‌లోని ఆ సంస్థకు చెందిన ఆర్థిక మూలాలపై అమెరికా ఆంక్షలు విధించింది. హమాస్ పెట్టుబడుల పోర్టుపోలియో నిర్వహించే వ్యక్తులు, ఇరాన్ ప్రభుత్వంతో దగ్గరి సంబంధాలు కలిగిన ఖతార్‌కు చెందిన ఫైనాన్సియర్, హమాస్ కీలక కమాండర్, గాజా కేంద్రంగా పని చేసే కొందరు హమాస్ సభ్యుల లక్ష్యంగా ఆంక్షలు విధించినట్లు అమెరికా అధికార వర్గాలు తెలిపాయి.
'నిధుల ప్రవాహాన్ని సహించం'
America Sanctions On Hamas : ఇజ్రాయెల్‌పై దాడుల నేపథ్యంలో హమాస్‌కు నగదు సమకూర్చే వారిపై వేగంగా, నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి జానెట్ యెల్లెన్ తెలిపారు. అంతర్జాతీయ వ్యవస్థల ద్వారా హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందకుండా అడ్డుకుంటామని అమెరికా సహాయ మంత్రి బ్రియాన్ నెల్సన్ తేల్చి చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం అంతర్జాతీయ వ్యవస్థ ద్వారా నిధుల ప్రవాహాన్ని తాము సహించమని తెలిపారు.
'ఇజ్రాయెల్‌ను అమెరికా గుడ్డిగా నమ్ముతోంది'
Israel Hamas War Update : మరోవైపు, ఇజ్రాయెల్- హమాస్ మధ్య బీకర యుద్ధం జరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ పర్యటన చేపట్టారు. గాజా ఆస్పత్రిలో పేలుడు ఘటనకు కారణం ఇజ్రాయెల్ సైన్యం కాదని బైడెన్ వ్యాఖ్యానించగా.. హమాస్ దాన్ని తోసిపుచ్చింది. అది అవాస్తవమని.. కేవలం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకే అమెరికా చెప్పిందని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో ఇజ్రాయెల్ వైపే అమెరికా గుడ్డిగా మొగ్గుచూపుతోందంటూ విమర్శలు గుప్పించింది