కెనడా నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నించి నదిలో మునిగిపోయిన మరో ఇద్దరి మృతదేహాలను కెనడా- యూఎస్ సరిహద్దులో శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు గురువారం ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. కాగా, చనిపోయిన వారిలో ఓ రొమేనియన్ కుటుంబానికి చెందిన వ్యక్తులతో పాటు భారతీయులు కూడా ఉన్నారని శుక్రవారం అధికారులు వెల్లడించారు.
ఇదీ జరిగింది..
కెనడా నుంచి అక్రమంగా అమెరికాలోకి వెళ్లేందుకు ప్రయత్నించి.. సెయింట్ లారెన్స్ నది దాటుతుండగా పడవ బోల్తా పడింది. అందులో ఉన్న ఓ రొమేనియన్, ఒక భారతీయ కుటుంబానికి చెందిన వ్యక్తులున్నారు. పడవ బోల్తా గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఏరియల్ సర్చ్ చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకుని.. గురువారం ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ పడవ నడిపిన కేసీ ఓక్స్(30) అనే వ్యక్తి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. అయితే, అతడు చనిపోయాడా లేక బతికే ఉన్నాడా అనే విషయం తెలియలేదని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి వాతావరణం పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. వాతావరణం అనుకూలించకే పడవ బోల్తా పడిందా లేక.. ఇందులో ఏమైనా స్మగ్లర్ల హస్తం ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు.