ఉక్రెయిన్‌కు మీరు చేస్తున్నది దానం కాదు. మాపై చూపుతున్నది దాతృత్వం కాదు. ప్రపంచ ప్రజాస్వామ్య పరిరక్షణకు మీరు పెడుతున్న పెట్టుబడి! రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీతో మీ సేనలెలా పోరాడాయో ఇప్పుడు పుతిన్ నాయకత్వంలోని రష్యాతో మేం అలాంటి పోరే చేస్తున్నాం. రష్యాపై మా విజయం కేవలం ఉక్రెయిన్ విజయమేకాదు, అమెరికా విజయం కూడా!.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగమిది. ఉన్నట్టుండి జెలెన్‌స్కీ అమెరికాలో పర్యటించటం వెనక ఆంతర్యమేంటి? ఆయన డిమాండ్లేంటి? అవెంతమేరకు నెరవేరాయి అని చూస్తే..
ఎందుకు నో అన్నారంటే..
పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో పాటు అడ్వాన్డ్స్ యుద్ధట్యాంకులు, దీర్ఘశ్రేణి క్షిపణులు కూడా అమెరికా తమకు ఇవ్వాలని జెలెన్‌స్కీ సలహాదారు మైఖెలో పొదొల్యాక్ కోరారు. అమెరికాకు చెందిన అత్యాధునిక ఎం-1 అబ్రామ్స్ యుద్ధ ట్యాంకులు కావాలన్నారు. ఈ చిట్టాతోనే జెలెన్‌స్కీ బైడెన్‌ను కలిశారు. పేట్రియాట్ రక్షణ వ్యవస్థకు ఓకే అన్న అమెరికా.. ఎం-1 అబ్రామ్స్ యుద్ధ ట్యాంకులు, దీర్ఘశ్రేణి క్షిపణులను అందించటానికి మాత్రం నిరాకరించటం విశేషం. ఇద్దరు అధ్యక్షుల సంయుక్త మీడియా సమావేశంలోనే ఈ విషయాన్ని బైడెన్ స్పష్టం చేశారు. "రష్యాపై దాడులు చేయటానికి వీలు కల్పించే క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇస్తే నాటో ఐక్యత దెబ్బతినే ప్రమాదముంది. రష్యాతో యుద్ధాన్ని నాటో దేశాలు కోరుకోవటం లేదు" అని బైడెన్ చెప్పేశారు. జర్మనీ కూడా.. అమెరికా ఇస్తేనే తామిస్తామంటూ మెలికపెట్టింది.
పర్యటన వెనక..
రష్యాతో యుద్ధం ఆరంభమయ్యాక తొలిసారి జెలెన్‌స్కీ దేశం దాటి బయటకు వచ్చారు. భారీ ఆశలను, డిమాండ్లను మోసుకుంటూ అమెరికా చేరుకున్నారు. పక్కనున్న జర్మనీ, ఇతర ఐరోపా దేశాలు సహా నాటో దేశాలన్నీ తనకు మద్దతిస్తున్నా.. వారందరినీ కాదని అమెరికాకు ప్రయాణం కావటం వెనక కారణాలు లేకపోలేదు. పెద్దన్న బైడెన్‌ను ప్రసన్నం చేసుకుంటే నాటోలోని అన్ని దేశాలూ ప్రసన్నమైనట్లేననే ఉద్దేశంతో జెలెన్‌స్కీ అమెరికాలో అడుగుపెట్టారు. అంతేగాకుండా.. వచ్చేనెల అమెరికా ప్రతినిధుల సభ కొత్తగా కొలువుతీరబోతోంది. ఇటీవలి ఎన్నికల్లో ఈ సభ రిపబ్లికన్‌ల వశమైంది. రిపబ్లికన్‌లు జెలెన్‌స్కీకి, ఉక్రెయిన్ యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు. వారు కొలువు దీరిన తర్వాత వస్తే ఇబ్బందులు తప్పవని గుర్తించి ముందుగానే అమెరికా పర్యటన పెట్టుకున్నారు జెలెన్‌స్కీ!