Indian High Commissioner Gurdwara :యూకేలోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామికి స్కాట్లాండ్లో చేదు అనుభవం ఎదురైంది. గురుద్వారాలోకి దొరైస్వామి ప్రవేశించకుండా కొందరు అడ్డుకున్నారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఖలిస్థానీ అంశంపై భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశమవుతోంది.
మీడియా కథనాల ప్రకారం.. దొరైస్వామి.. అల్బర్ట్ డ్రైవ్‌లోని గ్లాస్గో గురుద్వారా కమిటీ సభ్యులతో సమావేశం కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన విషయం తమకు ముందుగానే తెలిసిందని ఖలిస్థానీ సానుభూతిపరుడు ఒకరు వెల్లడించారు. దీంతో దొరస్వామి గురుద్వారా వద్దకు రాగానే.. బ్రిటన్‌లోని అతివాద సిక్కులు కొందరు ఆయన్ను అడ్డుకున్నారని తెలిపారు. 'గురుద్వారాకు మీకు ఆహ్వానం లేదు' అని వారు దొరస్వామితో చెప్పారని తెలిపారు. ఫలితంగా అక్కడ స్వల్ప ఘర్షణ జరిగిందని వివరించారు. యూకేలో ఉన్న ఏ గురుద్వారా లోపలికీ భారతీయ అధికారులకు స్వాగతం ఉండదని చెప్పుకొచ్చారు.
భారత్- యూకే కుమ్మక్కైపోయాయని ఖలిస్థానీ సానుభూతిపరుడు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య ఈ వ్యవహారంతో తాము విసిగిపోయామని చెప్పుకొచ్చాడు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో ఉద్రిక్తతలు పెరిగాయని తెలిపాడు. ఈ ఉద్రిక్తతల ప్రభావం బ్రిటిష్ సిక్కులపై పడిందని వివరించాడు. అయితే, ఈ ఘటన సమయంలో ఖలిస్థానీలతో వాదనకు దిగకుండా.. భారత హైకమిషనర్ బయటకు వెళ్లిపోయారని సమాచారం. ఈ విషయంపై యూకే విదేశాంగ శాఖకు, పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
'అందుకే చేసుంటారేమో!'
గురుద్వారాలోకి వెళ్లడంపై నిషేధం లేదని, దొరైస్వామిని అడ్డుకోవడానికి కారణాలేంటో తమకు తెలియదని పంజాబ్, పాటియాలాలోని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గ్రెవాల్ చెప్పుకొచ్చారు. దొరస్వామి రాకతో ఏవైనా ఉద్రిక్తతలు తలెత్తుతాయన్న భయంతోనే ఆయన్ను అడ్డుకొని ఉంటారని పేర్కొన్నారు. 'జగ్గీ జోహాల్‌ను అక్రమంగా అరెస్టు చేయడంపై ఇంగ్లాండ్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఇదంతా జరుగుతోంది. ఇలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా జాగ్రత్తపడాలని భారత ఎంబసీని కోరుతున్నా. గురుద్వారాలో ఓ రాయబారికి ఇలా జరిగితే.. సిక్కుల ఖ్యాతిపై ప్రభావం పడుతుంది. ఇంతకుముందు ఓ రాయబారిపై దాడి జరిగింది. దానికి మేం మద్దతు ఇవ్వడం లేదు. దాని వల్ల సిక్కుల ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా ప్రభావితమైంది' అని గ్రెవాల్ చెప్పుకొచ్చారు. మరోవైపు, గురుద్వారాలోకి ఏ మతస్థులైనా రావొచ్చని బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిర్సా పేర్కొన్నారు. సిక్కులకు అత్యంత సురక్షితమైన దేశం భారతేనని చెప్పారు. తమది హింసను విశ్వసించే మతం కాదని అన్నారు.
ఇదిలా ఉండగా.. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ఆరోపిస్తోంది. ఈ విషయంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌ను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇది ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించగా.. బదులుగా కెనడా రాయబారిని దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశించింది. కెనడా ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని భారత్ కొట్టిపారేసింది.
ఈ నేపథ్యంలో కెనడాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు జైశంకర్. నిజ్జర్ హత్య విషయంలో ఆరోపణలకు కచ్చితమైన ఆధారాలు ఉంటే చూపించాలని కెనడాకు స్పష్టం చేశారు. వాటిని పరిశీలించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అదేసమయంలో ఉగ్రవాదంపై కెనడా ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు జైశంకర్. రాజకీయ ఒత్తిళ్లతో కెనడా ఇలా చేస్తోందని విమర్శించారు.