Trump On Gaza Refugees :ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాను రెండోసారి అధికారంలోకి వస్తే గాజా శరణార్థులపై నిషేధం విధిస్తానని ప్రకటించారు. మొదటిసారి తాను తీసుకువచ్చిన ముస్లింల నిషేధాన్ని మరింతగా విస్తరిస్తానని వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా అయోవాలో మాట్లాడిన ట్రంప్.. ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను అధికారంలోకి వస్తే.. అమెరికా వచ్చే వారి ఆలోచనలు, సిద్ధాంతాలను ఇమ్మిగ్రేషన్‌లో పరీక్షిస్తామని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. హమాస్, ముస్లిం ఉగ్రవాదుల సానుభూతిపరులను దేశంలోకి రాకుండా నిషేధం విధిస్తామని స్పష్టం చేశారు. తమ దేశంలో ప్రమాదకరమైన ద్వేషం, మూర్ఖులను అనుమతించబోమని తెలిపారు. ఇస్లామిక్, హమాస్ ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన వారు పాలించేందుకు అనర్హులవుతారని పేర్కొన్నారు. అంతకుముందు డల్లాస్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా ప్రజాస్వామ్య దేశంగా మారేందుకు.. తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనని చెప్పారు.
అమెరికా నిధులతోనే ఇజ్రాయెల్‌పై దాడులు
మరోవైపు ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరోక్షంగా కారణమని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఆరోపించారు. అమెరికా ప్రజలు చెల్లించిన పన్నులతోనే ఈ దాడులకు నిధులు అందడం అవమానకరమని ట్రంప్ విమర్శించారు. బైడెన్ యంత్రాంగం నుంచి బయటికి వచ్చిన పలు నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు బాధాకరమని.. బలమైన శక్తితో దాడులను తిప్పికొట్టే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందన్నారు.