ఇరాన్లో భారీ భూకంపం.. ఏడుగురు మృతి.. 440 మందికి గాయాలు - ఇరాన్లో భారీ భూకంపం
ఇరాన్లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ఏడుగురు మరణించగా.. 440 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ఇరాన్‌ను భూకంపం వణికించింది. అజర్ బైజాన్ ప్రావిన్స్‌లోని కోయ్ నగరంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ఏడుగురు మరణించగా.. 440 మందికి గాయాలయ్యాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాలు మీద పడి కొందరు మరణించగా.. తప్పించుకునే ప్రయత్నంలో భవనాలపై నుంచి దూకి వందలాది మంది గాయపడ్డట్లు అధికారులు తెలిపారు.
ఘటనాస్థలానికి చేరుకున్న విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మంచు కురుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది.