తెలంగాణ

telangana

ETV Bharat / international

దక్షిణ కొరియాలో విషాదం.. హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట.. 151 మంది దుర్మరణం

దక్షిణకొరియాలో తీవ్ర విషాదం నెలకొంది. హాలోవీన్‌ వేడుకల్లో తొక్కిసలాట జరిగి 151 మంది దుర్మరణం చెందగా వందకుపైగా గాయపడ్డారు. రోడ్లపై గాయాలతో పడి ఉన్న వారిని చూసి అత్యవసర సిబ్బంది, పాదచారులు ప్రథమ చికిత్స చేశారు. సినీ తారను చూసేందుకు ఇరుకైన వీధిలో జనం పరుగులు తీయడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మృతులు, క్షతగాత్రులలో అత్యధిక మంది 20 ఏళ్లలోపు యువతేనని తెలిపారు. ఘటనపై దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

SKOREA-HALLOWEEN-DEATH TOLL
దక్షిణ కొరియా హాలోవీన్ మృతులు

By

Published : Oct 30, 2022, 6:07 AM IST

Updated : Oct 30, 2022, 7:46 AM IST

ఏటా జరిగే హాలోవీన్‌ వేడుకల్లో ఈసారి అపశ్రుతి చోటుచేసుకుంది. దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో శనివారం రాత్రి పెద్దఎత్తున ప్రజలు ఒక ఇరుకైన వీధి నుంచి వెళ్తుండగా.. ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 151మంది మృతిచెందగా... మరో150మందికిపైగా గాయాలపాలయ్యారు. గాయాలైన వారిలో ఎక్కువమంది గుండెపోటుకు గురయ్యారని, వారిపరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. రోడ్లపై గాయాలతో పడి ఉన్న వారిని చూసి అత్యవసర సిబ్బంది, పాదచారులు ప్రథమ చికిత్స చేశారు. మృతుల్లో 19 మంది విదేశీయులు ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది. ఇరాన్, ఉజ్బెకిస్థాన్, చైనా, నార్వే దేశీయులు ఘటనలో ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.

ఘటనాస్థలిలో సహాయక చర్యలు
ఘటనాస్థలిలో అంబులెన్సులు

ఘటన విషయం తెలుసుకోగానే ప్రభుత్వం పెద్దఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. దాదాపు 800 మంది అత్యవసర సిబ్బందిని.. 140 వాహనాలను రంగంలోకి దించింది. ఊపిరాడని పరిస్థితుల్లో రోడ్లపై పడిఉన్నవారిని సిబ్బంది స్ట్రెచర్లపై తీసుకెళ్లారు. అత్యవసరంగా గుండె చికిత్సలు అందిస్తూ మరికొంతమందిని కాపాడే ప్రయత్నాలు చేశారు. మృతదేహాలను స్థానిక ఆస్పత్రులకు తరలిస్తున్నామని... అక్కడ కుటుంబ సభ్యులు తమవారిని గుర్తించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మృతులు, క్షతగాత్రులలో అత్యధిక మంది 20 ఏళ్లలోపు యువతేనని తెలిపారు.

తొక్కిసలాట జరిగిన ప్రదేశం

సమీపంలో ఉన్న బార్‌కు ఒక సినీతార వచ్చారనే సమాచారంతో అక్కడికి వెళ్లేందుకు అనేకమంది ప్రయత్నించడమే తొక్కిసలాటకు కారణమని స్థానిక మీడియా పేర్కొంది. ఇటీవల దక్షిణ కొరియాలో కరోనా ఆంక్షల్ని సడలించడంతో ఈసారి హాలోవీన్‌ వేడుకలకు దాదాపు లక్షమంది వరకు హాజరయ్యారని స్థానిక మీడియా తెలిపింది. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌... గాయపడిన వారికి త్వరితగతిన చికిత్స అందించాలని... ఆ ప్రాంతంలో భద్రతను సమీక్షించాలని అధికారులను ఆదేశించారు.

.
Last Updated : Oct 30, 2022, 7:46 AM IST

ABOUT THE AUTHOR

...view details