Shopping Mall Fire Accident in Karachi : ఓ షాపింగ్ మాల్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. ఆరుగురు గాయపడ్డారు. పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో శనివారం జరిగిందీ ఘటన. మంటలను అదుపు చేసేందుకు వచ్చిన సిబ్బంది 42 మందిని రక్షించారు. మరికొందరు మంటల్లో చిక్కుకున్నట్టు సమాచారం.
శనివారం ఉదయం ఏడు గంటల సమయంలో షాపింగ్ మాల్ రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాసేపటికే మాల్లోని నాలుగు, ఐదు అంతస్తులకు వ్యాపించాయి. మంటలను అదుపు చేసేందుకు పన్నెండు అగ్నిమాపక యంత్రాలతో 50 మంది సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతి కష్టం మీద మంటలు ఆర్పారు. లోపల చిక్కుకున్న 42 మందిని రక్షించారు. గాయపడిన వారిని చిక్సిత కోసం ఆసుపత్రికి తరలించారు.
"మంటలను అదుపు చేసేందుకు మాల్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేశాం. ఊపిరాడక మంటల్లో చిక్కుకుని 11మంది మృతిచెందారు. భవనంలో ఉన్న వారి కోసం ఇంకా మా సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ఇంకా కారణాలు తెలియలేదు. దర్యాప్తు చేస్తున్నాం. గత వారమే కొంత మంది అధికారులు కరాచీలోని పలు భవనాలను పరిశీలించారు. వీటిలో 90 శాతం మేర భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని చెప్పారు."
-చీఫ్ ఫైర్ ఆఫీసర్ ముబిన్ అహ్మద్