Shooting In Mexico Today :మెక్సికోలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గ్వానాజువాటో రాష్ట్రంలోని సాల్వాటియెర్రా పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన క్రిస్మస్ పార్టీలో ఓ సాయుధుడు బీభత్సం సృష్టించాడు. పార్టీల్లో పాల్గొన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 'పొసాడా' అనే పార్టీ అనంతరం హాల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతోపాటు అదే రాష్ట్రంలోని సలామాంకా నగరంలో జరిగిన కాల్పుల్లో మరో నలుగురు మరణించారని వెల్లడించారు. అయితే ఆ కాల్పులకు దారితీసిన పరిస్థితులను తెలపలేదు.
గ్వానాజువాటోలో జాలిస్కో ముఠా, సినాలోవా ముఠా మద్దతు ఉన్న స్థానిక గ్యాంగ్‌ల మధ్య వైరం ఉంది. దీంతో ఈ రాష్ట్రంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. దేశంలో అత్యదిక హత్యలు జరిగిన రాష్ట్రం ఇదే.
ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం- ఐదుగురు పిల్లలు మృతి
Fire Accident In Arizona USA :అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. బుల్సిటీ నగరంలో కొలరడో నది సమీపంలోని కాలనీలో ఉన్న రెండంతస్తుల డుప్లెక్స్ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో పాటు 11, 13 ఏళ్ల వయసున్న మరో ఇద్దరు మృతిచెందారు. అయితే ప్రమాద సమయంలో ఇంట్లో పెద్దవారెవరూ లేరని తెలుస్తోంది. బాధితుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలను అగ్మిమాపక విభాగం ప్రతినిధులు వెల్లడించలేదు. ఈ కేసును నగర పోలీసులు, అగ్నిమాపక విభాగంతో పాటు ఇతర ఏజెన్సీలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి.