తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆయుధాల సరఫరా ఆపండి'.. అమెరికాకు రష్యా వార్నింగ్ - అమెరికా న్యూస్

Russia Warns America: అమెరికా సహా పాశ్చాత్య దేశాలకు రష్యా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లోకి పాశ్చాత్య ఆయుధాలను పంపే మార్గాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు రష్యా చమురు దిగుమతులను పూర్తిగా నిషేధించాలన్న ఐరోపా సమాఖ్య నిర్ణయాన్ని పుతిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తప్పుబట్టారు.

russia ukraine news
russia ukraine news

By

Published : May 4, 2022, 9:34 PM IST

Updated : May 4, 2022, 10:02 PM IST

Russia Warns America: అమెరికా సహా పాశ్చాత్య దేశాలు పంపుతున్న ఆయుధాలతో ఉక్రెయిన్‌ దళాలు రష్యా సేనలను గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. యుద్ధంలో రష్యా పైచేయి సాధించకుండా నిలువరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ దేశాలు ఆయుధ సంపత్తే లక్ష్యంగా ఉక్రెయిన్‌లో దాడులకు తెగబడుతున్న రష్యా.. వాటిని పంపుతున్న దేశాలకూ హెచ్చరిక జారీ చేసింది. ఉక్రెయిన్‌లోకి పాశ్చాత్య ఆయుధాలను పంపే మార్గాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది.

ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం చేస్తున్న అమెరికా దాని మిత్రదేశాలకు రష్యా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లోకి ఆయుధాలను మోసుకెళ్లే పాశ్చాత్య రవాణాలను చట్టబద్ధమైన లక్ష్యాలుగానే భావిస్తామని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు వెల్లడించారు. ఉక్రెయిన్‌కు అమెరికా, ఐరోపా దేశాలు ఆయుధాలను సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాటో దేశాలు పంపే ఆయుధాలు, సైనిక ఉత్పత్తులు ఉక్రెయిన్‌ భూభాగంలోకి చేరగానే వాటిని నాశనం చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని పాశ్చాత్య ఆయుధ స్థావరాలపై రష్యా దాడులకు తెగబడుతోంది. ఇటీవల ఒడెస్సాలోని ఉక్రెయిన్‌ వైమానిక స్థావరంపై క్షిపణి దాడులు జరిపిన మాస్కో సేనలు అమెరికా, ఐరోపా దేశాలు అందించిన డ్రోన్లు, క్షిపణులు, ఇతర ఆయుధాలు నాశనం చేసింది.
మరోవైపు రష్యా చమురు దిగుమతులను పూర్తిగా నిషేధించాలన్న ఐరోపా సమాఖ్య నిర్ణయాన్ని పుతిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తప్పుబట్టారు. ఈ నిర్ణయాన్ని రెండువైపుల పదునున్న కత్తితో పోల్చిన ఆయన.. దీనివల్ల ఐరోపా ప్రజలకు కూడా నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. రష్యా చమురు ఎగుమతుల్లో ఐరోపా దేశాలు 50శాతం వాటాను కలిగి ఉన్నాయన్న పుతిన్‌ ప్రతినిధి ఈయూ నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. నూతన ఆంక్షలను ఎదుర్కొనేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:'రష్యా చమురు వాడొద్దు'.. సభ్య దేశాలకు ఈయూ ఆర్డర్​!

Last Updated : May 4, 2022, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details