Dirty Bomb News : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తాజాగా వినిపిస్తున్న పదం డర్టీబాంబు! మీరు సిద్ధం చేస్తున్నారంటే మీరే చేస్తున్నారంటూ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారీ బాంబు గురించి! దీంతో యుద్ధం క్రమంగా అణు అంచులకు చేరుతోందంటూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏమిటీ డర్టీబాంబు? గతంలో ఎప్పుడు ఉపయోగించారు? ఏం చేస్తుందిది అని చూస్తే..
ఇప్పటి దాకా చరిత్రలో ఎన్నడూ డర్టీ బాంబును ప్రయోగించిన దాఖలాలు లేవు. 20 ఏళ్ల కిందట రష్యా దక్షిణ ప్రాంతమైన చెచెన్యాలో రెండుసార్లు వీటిని పేల్చటానికి విఫలయత్నం జరిగినట్లు చెబుతారు. ఇజ్రాయెల్ కూడా 2015లో ప్రయోగాత్మకంగా డిమోనా అణురియాక్టర్ వద్ద దీన్ని చేసి చూసిందని గతంలో వార్తలు వచ్చాయి. అల్‌ఖైదా ఉగ్రవాదుల వద్ద ఈ డర్టీ బాంబు తయారీకి సంబంధించిన పదార్థాలను గతంలో అమెరికా, బ్రిటన్‌లు పట్టుకున్నాయి.
డర్టీబాంబు అనేది అణుధార్మిక పదార్థంతో కూడుకున్నదే. కానీ ఇదేమీ పూర్తిస్థాయి అణుబాంబు కాదు. అణుబాంబులా గొలుసు చర్య ఉండదు. అణుధార్మిక ధూళి, పొగను వాతావరణంలోకి విడుదల చేసి భయాందోళలను కల్గించటానికి వినియోగించేది. అణ్వస్త్రాల కంటే కూడా చాలా సులభంగా, తక్కువ ధరలో వీటిని తయారు చేయొచ్చు. అణుధార్మిక పదార్థాలతో కలిపి డైనమైట్‌లాంటి పేలుడు పదార్థాలనే వీటిలోనూ ఉపయోగిస్తారు. పేలుడు తీవ్రతను బట్టి ఆ అణుధార్మిక పదార్థం వాతావరణంలో విస్తరిస్తుంది. ఈ పదార్థం ప్రమాదకరమైందేగాని మరీ ప్రాణాంతకం ఏమీ కాదు. వైద్యం, పరిశ్రమలు, పరిశోధన కేంద్రాల్లో వాడే వాటి పదార్థాల నుంచే డర్టీబాంబుల్లో వాడే అణుధార్మికతను సేకరిస్తారు.