Russia Ukraine News: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై క్షిపణి దాడులను తీవ్రతరం చేయనున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యా భూభాగంపై ఉక్రెయిన్ దాడులకు స్పందనగా కీవ్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో కీవ్‌లో శక్తిమంతమైన పేలుళ్లు సంభవించాయి. నగరంలో ఒకదాని తర్వాత ఒకటిగా.. మొత్తం మూడు పేలుళ్లు జరిగినట్లు స్థానిక ఎంపీ లెసియా వాసిలెంకో తెలిపారు. నగరంపై వైమానిక దాడి హెచ్చరిక ఒక గంటపాటు కొనసాగిందని ఎంపీ తెలిపారు.
ఈ నెల ప్రారంభంలోనే కీవ్ నుంచి బలగాలను ఉపసంహరిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. కానీ ఉక్రెయిన్ దాడి చేస్తోందన్న ఆరోపణలతో తిరిగి కీవ్‌పై విధ్వంసం సృష్టించేందుకు మాస్కో సేనలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా కీవ్ శివార్లలోని మిలటరీ ఫ్యాక్టరీ మీద క్షిపణి దాడులతో విరుచుకుపడినట్లు రష్యా రక్షణశాఖ ప్రకటించింది. అలాగే మరియూపోల్‌లోని ఇలిచ్ స్టీల్ ప్లాంట్‌పై పూర్తి ఆధిపత్యం సాధించినట్లు పేర్కొంది. దక్షిణ నగరం ఖెర్సన్ లోనూ.. పేలుళ్లు సంభవించినట్లు ఉక్రెయిన్ మీడియా చెప్పింది.