Russia Ukraine citizenship: ఉక్రెయిన్ వాసులంతా శీఘ్రగతిన రష్యా పౌరసత్వం పొందడానికి వీలు కల్పించే ఉత్తర్వుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం సంతకం చేశారు. తద్వారా ఉక్రెయిన్‌పై మాస్కో ప్రభావాన్ని మరింత విస్తరించే ప్రయత్నం మొదలైనట్లయింది. ఇటీవలి కాలం వరకు ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజిజియా, ఖేర్సన్ ప్రాంతాల నుంచి వచ్చినవారికే సులభతర విధానంలో రష్యా పౌరసత్వం లభించేది. దాదాపు ఇవన్నీ రష్యా నియంత్రణలోనే ఉండేవి. తాజాగా ఉక్రెయిన్ మొత్తానికి ఈ విధానాన్ని వర్తింపజేయాలని పుతిన్ నిర్ణయించారు. దీనిపై ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు. 2019లో ఈ విధానాన్ని రెండు ప్రాంతాల వారి కోసం ప్రారంభించగా ఈ ఏడాది మే నెలలో మరో రెండు ప్రాంతాలను చేర్చారు. మొత్తంమీద ఇప్పటివరకు దాదాపు 7.20 లక్షల మందికి రష్యా పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. ఉక్రెయిన్ జనాభాలో 18% మంది వీటిని పొందారు.
జర్మనీకి గ్యాస్ పైపులైన్ మూసివేత:రష్యా నుంచి జర్మనీకి ఉన్న ప్రధానమైన గ్యాస్ పైపులైన్‌ను వార్షిక నిర్వహణ పనుల పేరిట సోమవారం మూసివేశారు. ఈ నెల 21 వరకు పనులు కొనసాగుతాయని రష్యా చెప్పినా, ఆ గడువులో దీనిని పునరుద్ధరించకపోవచ్చని జర్మనీ అనుమానం వ్యక్తంచేసింది. సాంకేతిక కారణాల పేరిట ఇప్పటికే జర్మనీకి 60% మేర గ్యాస్ సరఫరాను రష్యా తగ్గించింది.