Plane Fire In Japan : జపాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. హొక్కైడో విమానాశ్రయం నుంచి బయల్దేరిన జేఏఎల్ 516 విమానం హనేడా ఎయిర్‌పోర్టులో దిగుతున్న సమయంలో జపాన్ కోస్టు గార్డుకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఢీ కొట్టింది. రన్‌వే లేదా టాక్సీవేపై విమానాలు ఢీకొన్నట్లు జపాన్ మీడియా పేర్కొంది. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటల్లో చిక్కుకున్న జేఏఎల్ విమానం కొంతదూరం అలాగే ప్రయాణించింది. మంటలు విమానం అంతా వ్యాపించక ముందు అందులో ఉన్న 367 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. వీరందర్నీ అధికారులు విమానాశ్రయ టెర్మినల్‌కు తరలించారు. 70 అగ్నిమాపక శకటాల వెంటనే అక్కడకు చేరుకుని విమానంలో మంటలను అదుపు చేశాయి. ఈ క్రమంలోనే విమానం రెండుగా విరిగిపోయింది. అప్పటికే విమానంలో చాలా భాగం మంటల్లో దగ్ధమైంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో హనేడా ఒకటి.
ఎయిర్‌పోర్ట్‌లో ఘోర విమాన ప్రమాదం- 380మంది సేఫ్, ఐదుగురు మృతి - రన్‌వేపై విమానంలో మంటలు
Plane Fire In Japan : కొత్త సంవత్సరం మొదటిరోజు జపాన్‌ను భారీ భూకంపం కుదిపేయగా రెండోరోజు విమాన ప్రమాదం జరిగింది. హొక్కైడో విమానాశ్రయం నుంచి బయల్దేరిన జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం హనేడా ఎయిర్‌పోర్టులో దిగుతున్న సమయంలో జపాన్ కోస్టు గార్డుకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఢీ కొట్టింది. ఒక్కసారిగా పేలుడు సంభవించి విమానాలు మంటల్లో చిక్కుకున్నాయి. జపాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఉన్న 379 మంది సురక్షితంగా బయటపడ్డారు. కోస్టుగార్డ్ విమానంలో ఉన్న ఆరుగురిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
By PTI
Published : Jan 2, 2024, 3:10 PM IST
|Updated : Jan 2, 2024, 6:34 PM IST
ఐదుగురు దుర్మరణం
Japan Plane Accident :మరోవైపు జేఏఎల్-516 విమానం ఢీ కొట్టిన కోస్టుగార్డు ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వీరిలో పైలెట్ ప్రమాదం నుంచి బయటపడగా ఐదుగురు సిబ్బంది మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు అక్కడి జాతీయ మీడియా ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. జపాన్‌లో భూకంప బాధితులకు సహాయం అందించడానికి ఈ కోస్ట్‌గార్డ్ విమానం బయలుదేరాల్సి ఉంది. ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది. తాజా ఘటనపై జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా స్పందించారు. తక్షణమే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడించాలని అధికారులను ఆదేశించారు.
'అందరూ క్షేమంగా ఉన్నారు'
జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం నుంచి సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు ఆ భయానక ఘటనకు సంబంధించి విషయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ప్రమాద సమయంలో తాను విమానంలోనే ఉన్నట్లు విలియం మాంజియోన్ అనే ప్రయాణికుడు ఎక్స్‌లో పోస్టు చేశారు. అందరూ క్షేమంగా ఉన్నారని తమని టెర్మినల్‌కు తీసుకెళ్తున్నట్లు రాసుకొచ్చారు. విమాన ప్రమాద దృశ్యాలు, ఆ సమయంలో విమానం లోపలి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.