Pakistan Soldiers Killed In Balochistan : పాకిస్థాన్‌లో భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న రెండు వాహనాలపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 14 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం జరిగిందీ దుర్ఘటన. పాక్ సైనికులు కాన్వాయ్ పస్ని నుంచి గ్వాదర్ జిల్లాకు వెళ్తుండగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైనవారిని వదిలిపెట్టబోమని ప్రకటించారు.
సైనికుల వాహనాలపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు- 14 మంది మృతి - Suicide Blast In Pakistan
By PTI
Published : Nov 3, 2023, 9:44 PM IST
|Updated : Nov 3, 2023, 10:20 PM IST
21:41 November 03
సైనికుల వాహనాలపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు- 14 మంది మృతి
మరోవైపు సైనికులపై ఉగ్రవాదుల జరిపిన దాడిని బలూచిస్థాన్ అపద్దర్మ ముఖ్యమంత్రి అలీ మర్దాన్ ఖండించారు. ఈ దాడులకు కారణమైనవారిని పట్టుకుంటామని అన్నారు. మరణించిన సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Explosion In Pakistan : పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని డెరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో శుక్రవారం పేలుడు సంభవించింది. పొండా బజార్ ప్రాంతంలోని ట్యాంక్ అడ్డా సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది, కేబీ బాంబ్ డిస్పోజల్ యూనిట్, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటన ప్రాంతం సమీపంలోని అన్ని ఆస్పత్రుల్లో అత్యవరస స్థితి ప్రకటించారు. అయితే దుండగులు ఓ మోటార్ బైక్‌లో పేలుడు పరికరాన్ని అమర్చారని తెలుస్తోంది. దీంతోపాటు ఘటన స్థలంలో తుపాకుల కాల్పుల శబ్దాలు కూడా వినిపించినట్లు సమాచారం.
Suicide Blast In Pakistan :కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడికి 55 మంది బలయ్యారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. బలూచిస్థాన్ రాష్ట్రం మస్తుంగ్ జిల్లాలోని మదీనా మసీదు వద్ద ఈ పేలుడు జరిగింది. ఈ దాడిలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీ నవాజ్ గాష్కోరి మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ ప్రవక్త జయంతి (ఈద్ మిలాదున్ నబీ) సందర్భంగా ర్యాలీ నిర్వహించేందుకు స్థానికులంతా జిల్లాలోని మదీనా మసీదు దగ్గర గుమిగూడారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి డీఎస్పీ కారు దగ్గరగా వెళ్లి తనను తాను పేల్చుకున్నాడు. శక్తిమంతమైన బాంబు పేలుడు ధాటికి 55 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నామని సిటీ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ మహ్మద్ జావెద్ లెహ్రీ తెలిపారు. గాయపడిన వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని జిల్లా వైద్యాధికారి రషీద్ మహ్మద్ సయీద్ చెప్పారు.