'మనం సృష్టించిన వారే ఇప్పుడు ఉగ్రవాదులయ్యారు'.. పాక్ పార్లమెంటులో మంత్రి వ్యాఖ్యలు - పార్లమెంట్లో ముజాహిదీన్‌లపై పాక్ మంత్రి వాఖ్యలు
పాక్ మంత్రి పార్లమెంటులో కీలక వ్యాఖ్యలు చేశారు. ముజాహిదీన్‌లను సృష్టించి పాకిస్థాన్ తప్పు చేసిందని ఆ దేశ హోంమంత్రి రానా సనావుల్లా ఒప్పుకున్నారు. వారే ఇప్పుడు ఉగ్రవాదులయ్యారని తెలిపారు.
ముజాహిదీన్‌లను సృష్టించి పాకిస్థాన్ తప్పు చేసిందని ఆ దేశ హోంమంత్రి రానా సనావుల్లా పార్లమెంటులో స్పష్టం చేశారు. 'మనం ముజాహిదీన్‌లను సృష్టించాం. వారే ఇప్పుడు ఉగ్రవాదులయ్యారు' అని పేర్కొన్నారు. ఉగ్రవాద దాడులతో తాము పడుతున్న కష్టాలను ప్రపంచం గుర్తించడం లేదని మరో మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడుల్లో పాకిస్థాన్‌కు ఇప్పటి వరకు సుమారు 12,600 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం సంభవించిందని వాపోయారు. మసీదులో ఆత్మాహుతి దాడిపై పారదర్శకంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ పోలీసులు బుధవారం పెషావర్‌లో నిరసన ప్రదర్శన జరిపారు. నేరస్థులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 101 మంది మరణించారు. వారిలో 97 మంది పోలీసులే. పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ అసీం మునీర్ సోమవారం పెషావర్ వెళ్లి పేలుడు స్థలాన్ని పరిశీలించారు.