పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, ప్రతిపక్ష పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్(70)కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై ఆ దేశ ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. కానుకల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం వివరాల్ని దాచిపెట్టిన కేసులో ఈమేరకు చర్యలు తీసుకుంది. ఫలితంగా ఇమ్రాన్ ఖాన్ ఐదేళ్లపాటు పార్లమెంటు సభ్యుడు అయ్యేందుకు వీలు లేకుండా పోయింది.
ప్రధాన మంత్రిగా ఉండగా వేర్వేరు దేశాల అధినేతలు, ప్రతినిధులు ఇచ్చిన కానుకల్ని.. పాకిస్థాన్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని 'తోషాఖానా' నుంచి తక్కువ ధరకు ఇమ్రాన్ ఖాన్ కొనుగోలు చేశారు. అయితే.. వాటిని విక్రయించడం ద్వారా ఎంత ఆదాయం వచ్చిందనే వివరాల్ని ఆయన బయటపెట్టలేదని ఆరోపిస్తూ ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన చట్టసభ్యులు కొందరు పాకిస్థాన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇమ్రాన్ ఖాన్ను అనర్హునిగా ప్రకటించాలని కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ.. ఈ వ్యవహారంపై విచారణ జరిపింది.