Pakistan Crisis 2023 : గడ్డి తినైనా అణుబాంబు తయారు చేస్తామని 1970వ దశకంలో.. పాకిస్తాన్ అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ప్రకటించాడు. అయితే ఇప్పుడు పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయి. కానీ తినడానికే తిండి దొరకడం లేదు. పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. విదేశీ మారక నిల్వలు తరిగిపోయాయి. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్ కష్టాలు.. మరింత పెరిగి శ్రీలంక కంటే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. డాలర్‌తో పోలిస్తే పాక్ రూపాయి మారకపు విలువ.. ఒక్కరోజులోనే 24రూపాయల మేర క్షీణించి 255కు చేరింది. పాక్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో రూపాయి పతనం కావడం ఇదే తొలిసారి. 1999లో కొత్త ఎక్సేంజ్ రేట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిన తర్వాత.. పాక్‌లో ఇదే అతిపెద్ద క్షీణత అని డాన్ వార్తా సంస్థ వెల్లడించింది.
తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు వీలుగా అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎమ్ఎఫ్ నుంచి రుణాలు పొందేందుకు పాక్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఐఎమ్ఎఫ్ సూచన మేరకు పాకిస్థాన్ ద్రవ్యమారకపు రేటుపై నిబంధనలను సడలించింది. దీంతో ఒక్కరోజులోనే పాక్ రూపాయి 24 రూపాయల మేర క్షీణించి డాలరుతో పాక్ రూపాయి మారకపు విలువ 255 రూపాయలకు పడిపోయింది. తాము నిధులివ్వాలంటే పాకిస్థాన్‌లో కరెంటు సబ్సిడీలను ఉపసంహరించాలనీ, అంతర్జాతీయ విపణి ధరలకు తగ్గట్టు గ్యాస్ ఛార్జీలను నిర్ణయించాలనీ, పాక్ రూపాయి మారక విలువను మార్కెట్ ఆధారంగా నిర్ణయించాలనీ, లెటర్ ఆఫ్ క్రెడిట్లపై నిషేధం తొలగించాలని ఐఎమ్ఎఫ్ గతంలో షరతులు పెట్టింది. ఇప్పుడు విడుదల చేయకపోతే 6.5 బిలియన్ డాలర్ల నిధులన్నీ రద్దయిపోతాయి. అందుకే పాక్ ఈ కఠిన నిర్ణయాలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. షరతులకు అంగీకరించిన నేపథ్యంలో వచ్చే వారం తమ బృందం పాకిస్తాన్‌లో పర్యటిస్తుందని ఐఎమ్ఎఫ్ వెల్లడించింది. షరతుల అమలుపై అధికారులతో చర్చలు జరపడానికి ఐఎమ్ఎఫ్ బృందం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు పాక్‌లో పర్యటిస్తుందని అధికారులు తెలిపారు.