Nurse Killed 7 Babies UK : నవజాత శిశువులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఓ నర్సు.. ఆస్పత్రిలో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఏడుగురు శిశువులను చంపేసింది. మరో ఆరుగురు శిశువులనూ చంపడానికి యత్నించింది. పసికందుల ప్రాణాలు తీయడానికి ఆమె భయంకరమైన మార్గాలను ఎంచుకుంది. ఇంజెక్షన్ ద్వారా శిశువుల రక్తంలోకి గాలిని పంపడం, నాసోగ్యాస్ట్రిక్ గొట్టాల ద్వారా వారి కడుపులోకి పాలు, నీటిని బలవంతంగా పంపడం, శ్వాసనాళాలకు అంతరాయం కలిగించి ఏడుగురు పసిగుడ్డులను చంపేసింది.
Nurse Murdered Babies Uk : ఇంగ్లాండ్‌లోని చెస్టర్‌లో కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న లూసీ లెబ్టీ(33) అనే నర్సు.. ఈ దారుణాలకు ఒడిగట్టింది. మాంచెస్టర్ క్రౌన్ కోర్టు శుక్రవారం ఆమెను దోషిగా తేల్చింది. సోమవారం ఆమెకు శిక్ష ఖరారు చేయనుంది. లూసీ 2015-16 మధ్య కాలంలో ఈ హత్యలకు పాల్పడింది.
Nurse Killed Babies UK :అయితే కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆస్పత్రిలో ఎటువంటి స్పష్టమైన కారణాలు లేకుండా, ఆకస్మికంగా ఆరోగ్యం విషమించి ఏడుగురు శిశువులు మృతి చెందారు. అన్ని సందర్భాల్లోనూ ఆస్పత్రి నవజాత శిశువుల వార్డులో లూసీ విధుల్లో ఉన్నట్లు తేలింది. భారతీయ మూలాలున్న వైద్యుడు రవి జయరాం సహా ఇతర వైద్యులు లూసీపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శిశుమరణాలపై 2017 మే నెలలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
UK Neonatal Nurse Killed Babies :విచారణ సమయంలో.. "నేను చెడ్డదాన్ని. నేనే ఇలా చేశాను. వారిని ఉద్దేశపూర్వకంగా చంపాను. ఎందుకంటే నేను వారిని చూసుకునేంత మంచిదాన్ని కాదు" అని రాసి ఉన్న కాగితాలు నర్సు లూసీ లెబ్టీ ఇంట్లో లభ్యమయ్యాయి. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబరులో కోర్టు విచారణ మొదలైంది. అయితే లూసీ లెట్బీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. నవజాత శిశువుల వార్డులో లోపాలను కప్పిపుచ్చేందుకే అక్కడి సీనియర్ వైద్యులు తనపై నిందలు మోపారని ఆమె తరఫు లాయర్ ఆరోపించారు.