Kim Jong Un: ఆయుధ సంపత్తిని పెంచుకోవడంలో తగ్గేదే లేదని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పునరుద్ఘాటించారు. ఎవరూ అడ్డుకోలేని అఖండ సైనిక శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నప్పుడే యుద్ధాన్ని నిరోధించగలమని పేర్కొన్నారు. అప్పుడే సామ్రాజ్యవాదుల బెదిరింపులను అడ్డుకోగలమని కిమ్ వ్యాఖ్యానించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ-కేసీఎన్ఏ పేర్కొంది. ఈ ప్రకటన ద్వారా పరోక్షంగా అమెరికాకు కిమ్ గట్టి హెచ్చరికలు పంపారు. నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని ఉత్తర కొరియా చేపట్టిన వేళ కిమ్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో అణ్వస్త్ర పరీక్షను కూడా ఉత్తరకొరియా చేపట్టే అవకాశం ఉందని ఈ ప్రకటన ద్వారా తెలుస్తోందని అంటున్నారు విశ్లేషకులు.
గత వారం చేపట్టిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగంతో ఈ ఏడాది ఇప్పటివరకు ఉత్తర కొరియా 12 పరీక్షలు నిర్వహించింది. సుదూర లక్ష్యాలను ఛేదించే హ్వాసాంగ్-17 క్షిపణిని గత శుక్రవారం ప్రయోగించింది. ఇది అమెరికా ప్రధాన భూభాగంలో ఎక్కడికైనా చేరుకునేలా రూపొందించారని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో మరింత శక్తిమంతమైన క్షిపణులను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తుందని కిమ్ పేర్కొన్నారు. నూతనంగా పరీక్షించిన హ్వాసాంగ్-17.. 6 వేల 248 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని వెయ్యి 90 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించింది. ఈ క్షిపణి బహుళ అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని తెలుస్తోంది. ఇది 67 నిమిషాల పాటు ప్రయాణించి జపాన్, కొరియా ద్వీపకల్పం మధ్యలోని సముద్ర జలాల్లో లక్ష్యాన్ని ఛేదించింది. నిటారుగా ఈ క్షిపణిని ప్రయోగిస్తే 15 వేల కిలోమీటర్లు వరకు ఇది వెళ్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు.