తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇమ్రాన్​పై 'అవిశ్వాస' అస్త్రం- ఇక కష్టమే!

No confidence motion Imran Khan: పాకిస్థాన్​ రాజకీయాల్లో సోమవారం కీలక పరిణామాలు జరిగాయి. ప్రధాని ఇమ్రాన్ ​ఖాన్​పై జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి ప్రతిపక్షాలు. దీనికి అనుకూలంగా మెజార్టీ సభ్యులు ఓటేయగా.. తీర్మానంపై 31న చర్చ జరగనుంది.

No-confidence motion against Imran Khan
No-confidence motion against Imran Khan

By

Published : Mar 28, 2022, 7:04 PM IST

No confidence motion Imran Khan: పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ను పదవీచ్యుతిడిని చేసేందుకు ప్రతిపక్షాలు చర్యలు ప్రారంభించాయి. జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్​పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ప్రతిపక్ష నేత పీఎంఎన్​-ఎల్​ అధ్యక్షుడు షాబాజ్​ షరీఫ్​. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు 161 మంది సభ్యులు అనుకూలంగా ఓటేశారు. దీంతో.. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్నట్లు తెలిపారు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్​ ఖాసిమ్​ ఖాన్​ సూరీ. దీనిపై 3 నుంచి 7 రోజుల్లో ఓటింగ్​ నిర్వహించాల్సి ఉంటుంది. స్పీకర్​ అసద్​ ఖైదర్ గైర్హాజరు నేపథ్యంలో.. సభను ఈ నెల 31 సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు సూరీ. మరోవైపు పంజాబ్‌ సీఎం ఉస్మాన్ బుజ్దార్‌.. తన పదవికి రాజీనామా చేసినట్లు పాకిస్థాన్​ మీడియా తెలిపింది. ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. ఓటింగ్‌కు ముందే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

342 మంది సభ్యులు ఉన్న నేషనల్‌ అసెంబ్లీలో ఇమ్రాన్‌ను తొలగించాలంటే విపక్షాలకు 172 మంది మద్దతు కావాలి. పీటీఐకి ప్రస్తుతం 155 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 24 మందికిపైగా సొంత పార్టీ సభ్యులు ఇమ్రాన్‌పై తిరుగుబావుటా ఎగరేయగా.. అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్​ గట్టెక్కడం కష్టమేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. మిత్రపక్షాలకు చెందిన 23 మంది కూడా ఇప్పటివరకు అధికారికంగా పాక్​ ప్రధానికి మద్దతు ప్రకటించలేదు. ఈ తరుణంలో ప్రధాని పదవిని కాపాడుకునేందుకు ఇమ్రాన్​ నానాతంటాలు పడుతున్నారు.

పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఇమ్రాన్ ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ ఈనెల 8న ప్రతిపక్ష పార్టీలకు చెందిన వంద మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. ఇమ్రాన్‌ ప్రభుత్వంపై సైన్యం విశ్వాసం కోల్పోయినట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ద్వారా సైన్యంలో చీలిక తెచ్చే ప్రయత్నాలు చేయటం పట్ల పాక్‌ సైన్యం ఇమ్రాన్‌పై కోపంగా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ రాజీనామాకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

పాకిస్థాన్‌లో ప్రస్తుత రాజకీయ అనిశ్చితికి ముగింపు పలికేందుకు ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్‌ రషీద్‌ అన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్‌లో త్వరలో ఓటింగ్‌ జరగనుంది. సంకీర్ణ ప్రభుత్వంలోని సభ్యులు సైతం అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉన్నందున.. ప్రభుత్వాన్ని కాపాడుకొనేందుకు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలే ఉత్తమంగా ఇమ్రాన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి:పీకల్లోతు కష్టాల్లో పాక్​ ప్రధాని​.. పదవి పోవడం ఖాయం!

'ఇమ్రాన్​ఖాన్ ఆట ముగిసింది.. అతడే పాక్​ కొత్త ప్రధాని!'

ABOUT THE AUTHOR

...view details