New York suicide: కుమార్తెలకు జన్మనిస్తున్నావంటూ భర్త వేధింపులు.. అత్తింటివారి సూటిపోటి మాటలు భరించలేని ఓ ప్రవాస భారతీయురాలు తనువు చాలించింది. అంతకుముందే తన బాధలను వెళ్లగక్కుతూ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. 'ప్రతిరోజు ఈ దాడులను భరించలేను. ఎనిమిదేళ్లుగా క్షోభకు గురవుతున్నా' అంటూ అందులో వాపోయింది. తన బాధలను పంచుకుంటూ.. చనిపోతున్నాను డాడీ నన్ను క్షమించు అంటూ పోస్ట్ చేసిన వీడియో హృదయాలను ద్రవింపజేస్తోంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన మన్‌దీప్ కౌర్‌కు (30) రన్‌జోద్‌బీర్ సింగ్ సంధుకు 2015లో వివాహం జరిగింది. అనంతరం వీరు అమెరికాలోని న్యూయార్క్‌కు వలస వెళ్లారు. వారికి 4, 2 ఏళ్ల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే కుమార్తెలు సంతానంగా కలగడంతో కౌర్‌కు వేధింపులు మొదలయ్యాయి. భర్త శారీరకంగా హింసించేవాడు. అత్తింటివారు సైతం మానసికంగా హింసించేవారు. 'ఆత్మహత్య చేసుకొని చనిపొమ్మంటూ అత్తింటివారు వేధిస్తున్నారు.' అని కౌర్ ఆ వీడియోలో వాపోవడం ఆమె దీనస్థితికి అద్దం పడుతోంది. భర్త దాడులకు సంబంధించి పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.