తెలంగాణ

telangana

ETV Bharat / international

నేపాల్ పొలిటికల్ డ్రామా.. కుప్పకూలిన సంకీర్ణం.. తదుపరి ప్రధానిగా ప్రచండ

నాటకీయ పరిణామాల మధ్య నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు సీపీఎన్-ఎంసీ ఛైర్మన్ పుష్ప కమల్ దహాల్ ప్రచండ. ప్రధాని పదవిని రొటేషన్ పద్ధతిలో చేపట్టాలన్న ఒప్పందంపై సంధి కుదరకపోవడం వల్ల.. ప్రస్తుత సంకీర్ణ కూటమి విచ్ఛిన్నం కాగా.. మాజీ ప్రధాని ఓలితో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రచండ సిద్ధమయ్యారు. ఆయన నియామకానికి నేపాల్ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

NEPAL-POLITICS
NEPAL-POLITICS

By

Published : Dec 25, 2022, 4:46 PM IST

Updated : Dec 25, 2022, 6:38 PM IST

Nepal political crisis : నేపాల్​ రాజకీయం అనూహ్య మలుపులు తిరిగింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఐదు పార్టీల కూటమి విచ్ఛిన్నమైంది. అధికార పంపకాలపై నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆ దేశ ప్రధాని షేర్ బహదుర్ దేవ్​బా, సీపీఎన్-మావోయిస్టు సెంటర్ పార్టీ ఛైర్మన్ పుష్ప కమల్ దహాల్ 'ప్రచండ' మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో, నాటకీయ పరిణామాల మధ్య మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి తలుపుతట్టిన ప్రచండ.. తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఓలితో పాటు విపక్షంలో ఉన్న పలు చిన్న రాజకీయ పార్టీలు ప్రచండకు మద్దతు ప్రకటించాయి.

ప్రచండ

మెజారిటీ కూడగట్టుకున్న ప్రచండ.. తన మద్దతుదారులతో కలిసి నేపాల్ రాష్ట్రపతి బిద్యా దేవి భండారిని కలిశారు. తనకు మొత్తం 169 మంది చట్టసభ్యుల మద్దతు ఉందని.. అధికారం ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని కోరారు. స్వతంత్రులు సైతం తనకు మద్దతు ప్రకటించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన్ను ప్రధానిగా నియమిస్తూ రాష్ట్రపతి భండారి ఆదేశాలు జారీ చేశారు.

తొలుత సంక్షోభం..
నేపాల్ ప్రధాని పదవీకాలం ఐదేళ్లు కాగా.. పదవిని రొటేషన్ పద్ధతిలో చేపట్టాలని ఎన్నికలకు ముందు దేవ్​బా, ప్రచండ అంగీకరించుకున్నారు. కాగా.. తొలి రెండున్నరేళ్లు ప్రధాని పదవి తనకు అప్పగించాలని ప్రచండ తాజాగా ప్రతిపాదించారు. దీనికి ప్రస్తుత ప్రధానమంత్రి దేవ్​బా నిరాకరించారని ప్రచండ పార్టీ కార్యదర్శి గణేశ్ షా తెలిపారు. 'ఈ విషయంపైనే ఆదివారం ఉదయం ప్రచండ, దేవ్​బా చర్చలు జరిపారు. ప్రధాని, అధ్యక్ష పదవులు రెండింటినీ వదులుకునేది లేదని దేవ్​బా పార్టీ నేపాలీ కాంగ్రెస్ తేల్చి చెప్పింది. స్పీకర్ పదవిని మాత్రమే మా పార్టీకి కేటాయిస్తామని స్పష్టం చేసింది. దీన్ని ప్రచండ తప్పుబట్టారు. ఫలితంగా చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా కూటమి విడిపోయింది. చివరి నిమిషంలో దేవ్​బా, ప్రచండ మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు' అని గణేశ్ షా తెలిపారు.

ఓలితో ప్రచండ చర్చలు
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ వ్యూహం అమలు చేశారు ప్రచండ. సహచర కమ్యూనిస్టు పార్టీ నేత, 'సీపీఎన్-యూఎంఎల్' ఛైర్మన్, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలిని కలిశారు. తాను ప్రధాని అయ్యేందుకు పార్లమెంట్​లో మద్దతు తెలపాలని ఓలిని ప్రచండ కోరారు. ప్రచండతో పాటు జనతా సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర యాదవ్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ అధ్యక్షుడు రాజేంద్ర లింగ్డెన్, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు రవి లమిచానె సైతం ఓలి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. పదవుల పంపకాలపై నేతలు జరిపిన చర్చలు ఫలించాయి. 78 స్థానాలు ఉన్న సీపీఎన్-యూఎంఎల్.. ప్రచండకు మద్దతు ప్రకటించింది. పలు చిన్న పార్టీలు సైతం ప్రచండ వెంటే నడిచాయి. తొలుత తానే ప్రధాని కావాలన్న ప్రతిపాదనకు ఓలి అంగీకారం తెలిపారు. దీంతో ప్రధాని పదవి చేపట్టడానికి ప్రచండకు మార్గం సుగమమైంది.

ప్రచండ, ఓలి భేటీ

నేపాల్ ప్రతినిధుల సభలో మొత్తం 275 స్థానాలు ఉండగా.. మెజారిటీకి 138 సీట్లు అవసరం. నవంబర్​లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే మెజారిటీ స్థానాలు రాలేదు. ప్రస్తుతం నేపాలీ కాంగ్రెస్ పార్టీకి 89 సీట్లు ఉండగా.. సీపీఎన్-యూఎంఎల్​ పార్టీకి 78, సీపీఎన్-ఎంసీకి 32 సీట్లు ఉన్నాయి. అయితే, సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు నేపాల్ రాష్ట్రపతి బిద్యా భండారి ఆదివారం వరకు గడువు ఇచ్చారు.

ఓలి నివాసంలో చర్చలు

ఓలి, ప్రచండ.. గత స్నేహితులే!
2018 మేలో.. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్-(సీఎంపీ-యూఎంఎల్)), పుష్ప కమల్ దహాల్ ఆధ్వర్యంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(మావోయిస్టు సెంటర్(సీపీఎన్(ఎంసీ)) పార్టీలు కలిసి 'నేపాల్ కమ్యూనిస్టు పార్టీ'గా ఏర్పడ్డాయి. నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో కీలక నేతలైన ప్రచండ, ఓలి.. అధికారాన్ని రెండున్నరేళ్ల చొప్పున పంచుకోవాలని తొలుత నిర్ణయించుకున్నారు. అనంతరం, ప్రధానిగా ఓలినే కొనసాగించాలని 2020లో పార్టీ నేతలు అంగీకరించుకున్నారు.

ఆ తర్వాత కొద్దిరోజులకే ఓలి, ప్రచండ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సర్కారును సరిగా పనిచేయనివ్వడం లేదని ఓలి.. పార్టీకి తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రచండ పరస్పరం ఆరోపించుకున్నారు. ఈ పరిణామాల మధ్య 2021 మార్చిలో.. నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ఏకీకరణను నేపాల్ సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో నేపాల్ కమ్యూనిస్టు పార్టీ.. మళ్లీ రెండుగా విడిపోయింది. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు ప్రచండ. అక్కడితో ఇరువురి మధ్య బంధం తెగిపోయింది.

Last Updated : Dec 25, 2022, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details