Vietnam Fire Accident :వియత్నాంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 56 మంది మరణించారు. అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల మరో 50మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి రాజధాని హనోయ్‌లో జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 70 మందిని రక్షించామని.. మరో 54 మంది క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తొమ్మిది అంతస్తుల భవనంలోని పార్కింగ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి మంటలు మొదలయ్యాయి. అవి తర్వాత పైఅంతస్తులకు వ్యాపించినట్లు పోలీసులు వివరించారు. ఈ భవనంలో 150కి పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం వరకు కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో 56 మంది మృతి చెందారు. 54 మంది క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. చనిపోయిన 56 మందిలో 39 మందిని పోలీసులు గుర్తించినట్లు వియత్నాం అధికారిక మీడియా సంస్థ బుధవారం తెలిపింది.
South Africa Fire Accident :ఇటీవల దక్షిణాఫ్రికా రాజధాని జోహన్నెస్‌బర్గ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 73 మంది ప్రాణాలు కోల్పోయారు. జోహన్నెస్‌బర్గ్‌లోని బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమాచారం అందగానే ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల తీవ్రతకు భవనం చాలావరకు ధ్వంసమైందని, దట్టమైన పొగ కమ్మేయడం వల్ల సహాయ చర్యలకు ఇబ్బంది ఎదురైందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ప్రాణ భయంతో కొంతమంది బాధితులు.. తమను తాము కాపాడుకోవడానికి కిందికి దూకారని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.