threat to Mohenjo Daro : ప్రకృతి విపత్తులకు కుప్పకూలిన అలనాటి సింధు నాగరికత ఆనవాళ్లు. మళ్లీ అదే ప్రకృతి ప్రకోపానికి ఇవాళ విలవిల్లాడుతున్నాయి. పాకిస్థాన్‌ను ముంచెత్తిన వరదలు చారిత్రక మొహంజోదారోకు ముప్పుగా పరిణమించాయి. అటు వానలు, వరదలకు ఇటు స్థానికులు, ప్రభుత్వ నిర్లక్ష్యం తోడవటంతో మొహంజోదారో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు రద్దయ్యే ప్రమాదంలో పడింది.సింధూ నది ఒడ్డున 5 వేల సంవత్సరాల కింద విలసిల్లిన నాగరికతకు సాక్ష్యాలు ఈనాటి మొహంజోదారోలోని శిథిలాలు. నాటి మానవ విజ్ఞానానికి ప్రతీకగా కొనియాడుతూ వీటిని ప్రపంచ వారసత్వ సంపదగా 1980లో యునెస్కో గుర్తించింది. "మానవాళి చరిత్రలోని అత్యంత పురాతన అద్భుత మూడు నాగరికతల్లో సింధూలోయ నాగరికత ఒకటి.
ప్రణాళికబద్ధంగా ఇటుకలతో నిర్మించిన కట్టడాలు, స్నానాల గదులు, మురుగునీటి కాల్వలు, బావులు... అన్నీ కూడా మెరుగైన సివిల్ ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, సౌకర్యాలకు అద్దం పడుతున్నాయి" అని యునెస్కో కీర్తించింది. నేటి పాకిస్థాన్‌లో అధికభాగం, భారత్‌లోని గుజరాత్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లో కొంతభాగం మేర ఈ మొహంజోదారో నాగరికత వెలిసింది. ఇరాన్ సరిహద్దుల దాకా ఇది విస్తరించింది.
క్రీస్తుపూర్వం 2500-1700 మధ్య విలసిల్లి ప్రకృతి విపత్తులతో కాలగర్భంలో కలసి పోయిందనుకుంటున్న ఈ నాగరికత 1920ల దాకా వెలుగు చూడలేదు. 1920లో చేపట్టిన భారత పురాతత్వశాఖ తవ్వకాల్లో దీని ఆనవాళ్లు బయటపడ్డాయి. 1965 దాకా ఈ తవ్వకాలు కొనసాగాయి. ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాలు హరప్పా, మొహంజోదారో (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్నాయి), లోథల్, కాలిబంగన్, ధోలావిరా, రాఖిగర్హి (భారత్‌లో) బయటపడ్డాయి. ఆ కాలంలోనే అత్యంత అధునాతన నగరాలుగా వీటిని భావిస్తారు. 1947లో దేశ విభజన సమయంలో సింధు నాగరికతకు ఆనవాళ్లుగా మిగిలిన ప్రాంతాలు పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, భారత్‌ల మధ్య విడిపోయాయి. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతాలను అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు.
వరదలతో ఉక్కిరిబిక్కిరై..
కొద్దిరోజుల కిందట పాకిస్థాన్ అనూహ్య వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరైంది. ముఖ్యంగా సింధ్ ప్రాంతం. మొహంజోదారో పురాతత్వ స్థలాలున్న ప్రాంతంలో 77 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది. వారసత్వ సంపదగా భావిస్తున్న అనేక చోట్ల గోడలు కూలిపోయాయి. బురద కొట్టుకు వచ్చింది. ఈ ప్రకృతి విలయానికి తోడు... మానవ తప్పిదాలు కూడా చారిత్రక కట్టడాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. స్థానిక భూస్వాములు డ్రైనేజీ, ఇతర నీటి సరఫరా పైపులైన్లను మొహంజోదారో ఛానల్ చారిత్రక కట్టడాలవైపు మళ్లించారు. ఫలితంగా వారసత్వ సంపద ప్రమాదంలో పడింది.