Migrants Boat Capsized : వలసదారులతో వెళ్తున్న ఓ పడవ మునిగి ఏడుగురు చనిపోగా 56 మందికి పైగా గల్లంతయ్యారు. పశ్చిమ ఆఫ్రికా తీరానికి దాదాపు 620 కి.మీ దూరంలో ఉన్న కేప్ వర్డె దీవుల్లో జరిగిన ఈ ఘటనలో 38 మంది ప్రాణాలతో బతికి బయటపడ్డారు. ఈ విషయాన్ని యూఎన్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఫర్ ఆర్గనైజేషన్ సంస్థ తెలిపింది.
Migrants Boat Accident : జులై 10వ తేదీన సెనెగల్ నుంచి 100 మంది వలసదారులతో బయలుదేరిన పడవ మునిగిపోయినట్లు స్పెయిన్‌కు చెందిన ఓడ సిబ్బంది గుర్తించారు. అనంతరం కేప్ వర్డియన్ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఏడుగురి మృతదేహాలను గుర్తించారు. ప్రమాదంలో గల్లంతైన వారంతా మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అయితే చేపలు పట్టే చిన్న పడవలో బయలుదేరిన వలసదారులు స్పెయిన్‌కు వెళ్తున్నట్లు సమాచారం. గల్లంతైన వారిలో తన ఇద్దరు మేనల్లుళ్లు కూడా ఉన్నారని స్థానిక మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు ఛైఖ్ అవ బోయె తెలిపారు.