Floods in Pakistan: పాకిస్థాన్‌లో అసాధారణ వరదలకు వాతావరణ మార్పులతో పాటు హిమాలయాలు కరగడం కూడా కారణంగా నిలుస్తోంది. హిమాలయాల్లో మంచు ఫలకాలు ఈ ఏడాది రికార్డు స్థాయిలో కరిగిపోయాయని ఇందోర్ ఐఐటీ బృందం గుర్తించింది. ఈ బృందం 15 ఏళ్ల నుంచి హిమాలయాల్లో మంచుపై పరిశోధనలు నిర్వహిస్తోంది. ఈ వేసవిలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల హిమఫలకాలు కరిగాయని చెబుతోంది.
"ఈ సారి మార్చి, ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతలు 100 ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టాయి. ఫలితంగా మంచు ఫలకాలు కరిగిపోయాయి. గత వారం మా బృందం మంచు ఫలకంపైనే ఉంది. హిమాలయాల్లో రికార్డు స్థాయిలో మంచు కరగటాన్ని గమనించాం" అని ఐఐటీ పరిశోధకుల బృందంలోని గ్లేసియాలజిస్టు మహమ్మద్ ఫరూఖ్ ఆజమ్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో అతి తీవ్ర స్థాయిలో వర్షాలు పడి ఓ పక్క నదులు నిండిపోయాయి. మరోవైపు హిమాలయాలపై సుదీర్ఘకాలంగా ఉన్న మంచు ఫలకాలు కరిగి ఆ నీరు పాకిస్థాన్ వైపు ప్రమాదకర స్థాయిలో చేరుతోంది. దీంతో 30 మిలియన్ల మంది ప్రభావితం అయ్యారు. లక్షల హెక్టార్లలో పొలాలు నీటమునిగాయి. 20 డ్యామ్‌లపై నుంచి నీరు పొంగిపొర్లుతోంది.