తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ విమానాన్ని పైలట్లే కూల్చారా..? తెరపైకి కొత్త ఆధారాలు!

మలేసియా ఎయిర్‌లైన్స్‌ విమాన దుర్ఘటనపై కొత్త ఆధారాలు తెరపైకి వచ్చాయి. దీంతో ఆ విమానాన్ని పైలట్లే దాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

pilot shot down the Malaysian Airlines plane that crashed eight years ago
విమానం

By

Published : Dec 14, 2022, 7:30 AM IST

Malaysia Airlines Crash 2014 : ఎనిమిదేళ్ల కిందట ప్రమాదానికి గురైన మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి సంబంధించి కొత్త వాదనలు తెరపైకి వచ్చాయి. పైలట్లే దాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ లోహవిహంగానికి సంబంధించిన శకలాన్ని పరిశీలించిన నిపుణులు ఈ మేరకు విశ్లేషిస్తున్నారు. ఎంహెచ్‌370 అనే ఈ విమానం 2014 మార్చి 8న కౌలాలంపూర్‌ నుంచి బీజింగ్‌కు వెళ్లే క్రమంలో అదృశ్యమైంది. ఆ సమయంలో అది మలేసియాలోని పెనాంగ్‌ దీవికి వాయవ్య దిక్కులో హిందూ మహాసముద్రం మీదుగా పయనిస్తోంది. ఆ తర్వాత ఎంత గాలించినా ఆ లోహ విహంగం ఆచూకీ లభించలేదు. దీంతో విమానంలోని 239 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించినట్లుగా పరిగణించారు.

బోయింగ్‌-777 తరగతికి చెందిన ఈ విమాన చక్రాల భాగానికి సంబంధించిన తలుపు..
తుపాను ధాటికి 2017లో మడగాస్కర్‌ తీరానికి కొట్టుకొచ్చింది. అదే ఏడాది టాటాలీ అనే మత్స్యకారుడికి ఇది దొరికింది. దీని ప్రాముఖ్యతను గుర్తించని అతడు.. ఐదేళ్ల పాటు ఆ శకలాన్ని తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఆయన భార్య దీన్ని బట్టలు ఉతకడానికి ఉపయోగించింది. 25 రోజుల కిందట అది నిపుణుల దృష్టికి వచ్చింది. బ్రిటన్‌కు చెందిన ఇంజినీరు రిచర్డ్‌ గాడ్‌ఫ్రే, అమెరికాకు చెందిన విమాన శకలాల అన్వేషకుడు బ్లెయిన్‌ గిబ్సన్‌లు ఆ భాగాన్ని విశ్లేషించారు.

దానిపై సమాంతరంగా ఉన్న నాలుగు పగుళ్లను వారు గుర్తించారు. సాగరజలాలను బలంగా తాకినప్పుడు విమానానికి సంబంధించిన ఒక ఇంజిన్‌ విచ్ఛిన్నమై ఉంటుందని, ఆ క్రమంలో ఈ డోర్‌పై పగుళ్లు ఏర్పడి ఉంటాయని విశ్లేషించారు. ‘‘వేగంగా సముద్ర జలాలను ఢీ కొట్టేలా చేయడం ద్వారా విమానం విచ్ఛిన్నమయ్యేలా చేశారు. అలాగే చక్రాల భాగం విచ్చుకునేలా చేసి, ఆ లోహవిహంగాన్ని సాధ్యమైనంత త్వరగా జలసమాధి చేయాలని భావించారు. దీన్నిబట్టి కూల్చివేతకు సంబంధించిన ఆధారాలను దాచేయాలన్న ఉద్దేశం కనపడుతోంది’’ అని వారు పేర్కొన్నారు.

అత్యవసర సమయంలో నీటిపై విమానాన్ని దించాల్సి వచ్చినప్పుడు సాధారణంగా పైలట్లు..
చక్రాలను విచ్చుకునేలా చేయరు. అలాచేస్తే లోహవిహంగం విచ్ఛిన్నమై, త్వరగా నీటిలో మునిగిపోతుంది. ప్రయాణికులకు తప్పించుకోవడానికి సమయం కూడా పెద్దగా ఉండదని నిపుణులు తెలిపారు. సాధ్యమైనన్ని ఎక్కువ భాగాలుగా ఎంహెచ్‌370 విమానాన్ని విచ్ఛిన్నం చేయాలన్న తలంపు కుట్రదారుల్లో ఉందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details