తెలంగాణ

telangana

ETV Bharat / international

'శాంసంగ్' వారసుడికి క్షమాభిక్ష.. జైలు నుంచి విముక్తి.. ఇక బిజినెస్​పై దృష్టి - samsung heir lee jae yong jail

లంచం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష ఎదుర్కొంటున్న ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ వారసుడు లీ జే యాంగ్‌కు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో మరో ఏడాది జైలు శిక్ష ఉండగానే.. జే యాంగ్‌కు కేసు నుంచి విముక్తి లభించింది. త్వరలోనే యాంగ్​ సామ్‌సంగ్‌ కంపెనీ బోర్డులో చేరి, పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు.

lee jae yong samsung
'శాంసంగ్' వారసుడికి క్షమాభిక్ష.. జైలు నుంచి విముక్తి.. ఇక బిజినెస్​పై దృష్టి

By

Published : Aug 12, 2022, 1:26 PM IST

Lee Jae Yong Samsung : లంచం కేసులో 18 నెలల జైలు శిక్ష అనుభవించిన శాంసంగ్‌ వారసుడు లీ జే యాంగ్‌కు.. కేసు నుంచి పూర్తిగా విముక్తి లభించింది. లీ జే యాంగ్‌కు క్షమాభిక్ష పెట్టాలని దక్షిణ కొరియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని జైల్లో ఉన్న వ్యాపార ప్రముఖులకు.. ఇలా కేసుల నుంచి విముక్తి కల్పించడం దక్షిణ కొరియాలో ఎప్పటినుంచో కొనసాగుతోంది. ఆగస్టు 15న దక్షిణ కొరియా లిబరేషన్‌ డే సందర్భంగా దాదాపు 17 వందలమంది దోషులకు అధ్యక్షుడు యూన్‌ సుక్‌ ఇయోల్‌ క్షమాభిక్ష పెట్టనున్నారు. ఇందులో జే యాంగ్‌తో పాటు మరో ప్రముఖ వ్యాపారవేత్త షిన్‌ డోంగ్‌ బిన్‌ పేర్లు కూడా ఉన్నాయి. ఈ క్షమాభిక్షతో జే యాంగ్‌కు కేసు నుంచి విముక్తి లభించడమే గాక, జైలు శిక్ష నేపథ్యంలో విధించిన ఉద్యోగపరమైన ఆంక్షలు కూడా తొలగిపోనున్నాయి. దీంతో ఆయన తిరిగి కంపెనీ బోర్డులోకి వచ్చి పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు.

54 ఏళ్ల లీ జే యాంగ్‌.. శాంసంగ్‌ గ్రూప్‌ అధినేత లీ కున్‌ హీ పెద్ద కుమారుడు. ప్రస్తుతం శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. లంచం కేసులో 2017లో లీ జే యాంగ్‌ అరెస్టయ్యారు. శాంసంగ్‌‌కు చెందిన రెండు అనుబంధ కంపెనీల విలీనానికి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందేందుకు 2015లో అప్పటి దేశాధ్యక్షురాలు పార్క్‌ గ్వెన్‌ హైకు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై లీ జే యాంగ్‌ను అరెస్టు చేశారు. కేసును విచారించిన న్యాయస్థానం జే యాంగ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కుంభకోణం బయటపడిన తర్వాత అప్పటి పార్క్‌ ప్రభుత్వం కూలిపోయింది. తనకు విధించిన శిక్షపై జే యాంగ్‌ అప్పీలేట్‌ కోర్టును ఆశ్రయించగా.. 2018లో కోర్టు ఈ శిక్షను తాత్కాలికంగా నిలిపేసింది. ఆ తర్వాత ఈ వ్యవహారం దక్షిణ కొరియా సుప్రీంకోర్టుకు చేరగా.. లీ జే యాంగ్‌కు రెండున్నర ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా 18 నెలలు జైలు శిక్ష అనుభవించిన ఆయన.. గతేడాది ఆగస్టులో పెరోల్‌పై బయటకు వచ్చారు.
లంచం కేసు రీత్యా విధించిన ఆంక్షల కారణంగా ఇప్పటివరకు కంపెనీలో కీలక నిర్ణయాలు తీసుకునే బాధ్యతల నుంచి లీ జే యాంగ్‌ దూరమయ్యారు. తాజాగా ఆయనకు క్షమాభిక్షతో త్వరలోనే తండ్రి వారసత్వాన్ని అందుకుని కంపెనీ పగ్గాలు చేపట్టే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details