Jinping G20 Summit 2023 : అంతా ఊహించినట్లే జరిగింది. సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న వేళ.. దిల్లీ వేదికగా జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గైర్హాజరుకానున్నారు. ఈ సదస్సుకు జిన్‌పింగ్ హాజరుకావడం లేదనే విషయాన్ని సోమవారం చైనా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఆయన స్థానంలో చైనా ప్రధాని లీ చియాంగ్ భారత్ వస్తున్నారు. భారత ప్రభుత్వం ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 9,10 తేదీల్లో దిల్లీలో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని లీ చియాంగ్ పాల్గొంటారని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. చైనా బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారని వెల్లడించింది.
భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ తర్వాత..
2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఇటీవల దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో మోదీ, జిన్‌పింగ్ కాసేపు మాట్లాడుకున్నా.. అధికారికంగా ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. భారత్ ఒకవైపు జీ20 సదస్సుకు ఏర్పాట్లు చేస్తుండగానే.. చైనా సరికొత్త మ్యాప్‌తో వివాదం మొదలుపెట్టింది. సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్, తైవాన్, దక్షిణ చైనా సముద్రాలను తమ దేశంలోని భూభాగాలుగా అందులో పేర్కొంది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల మధ్య జిన్‌పింగ్ భారత్ రావడం లేదు.
జీ20పై జిన్‌పింగ్ నిర్ణయం నిరాశపర్చింది: బైడెన్
Biden Xi Jinping :జీ20కి హాజరుకాకూడదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిరాశ వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై డేలావేర్‌లో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు బైడెన్ స్పందిస్తూ.. తాను నిరుత్సాహానికి గురైనట్లు తెలిపారు. అయితే తాను జిన్‌పింగ్‌ను కలిసేందుకు వెళుతున్నట్లు ముక్తసరిగా పేర్కొన్నారు. కానీ, బైడెన్- జిన్‌పింగ్ సమావేశం ఎక్కడ జరుగుతుందనే సమాచారం మాత్రం వెల్లడించలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ 7 నుంచి 10వ తేదీ మధ్యలో బైడెన్ భారత పర్యటన జరుగుతుంది. అనంతరం ఆయన వియత్నాంలో పర్యటించనున్నారు.